తొలిసారిగా రాజకీయాలలోకి ప్రవేశించి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన సురభి వాణీదేవి తొలి రౌండ్ నుంచే ఆధిక్యతలోనే కొనసాగుతుండగా, అపార రాజకీయానుభవం కలిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ, బిజెపి అభ్యర్ధి రామచందర్ రావు ఏడు రౌండ్లలోనూ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఏడు రౌండ్లలో కలిపి సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు రాగా, రామచందర్ రావుకు 1,04,668 ఓట్లు వచ్చాయి. దీంతో సురభి వాణీదేవి ఆయనపై 8,021 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కనుక రెండో లేదా మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా తదనుగుణంగానే ఉండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో బిజెపి రెండో స్థానంలో ఉంది కానీ వరంగల్-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గంలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అక్కడ కూడా టిఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయావకాశాలున్నాయి.
ఒకవేళ రెండు నియోజకవర్గాలలో టిఆర్ఎస్ గెలిచినట్లయితే, దుబ్బాక, గ్రేటర్ పరాభవాలకు బిజెపిపై ప్రతీకారం తీర్చుకొన్నట్లవుతుంది. ఇంతకాలం ఆ రెండు విజయాల గురించి చాలా అతిగా చెప్పుకొంటూ టిఆర్ఎస్‌పై రాజకీయంగా పైచేయి సాధించాలని కలలుకంటున్న బిజెపి కనీసం తమ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటును గెలుచులేకపోతే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామనే దాని వాదనలు అర్ధరహితంగా మారుతాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో బిజెపి ఓడిపోతే నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో ఎదురీత తప్పకపోవచ్చు.