టిఆర్ఎస్ ఎన్నికల హామీలలో నిరుద్యోగ భృతి కూడా ఒకటి. 2018 శాసనసభ ఎన్నికల సమయంలో ఆ హామీ ఇచ్చింది. రెండేళ్ళు గడుస్తున్నా ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. అయితే సిఎం కేసీఆర్ ఇవాళ్ళ శాసనసభలో నిరుద్యోగ భృతి గురించి మాట్లాడారు.
“కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల భారం పడింది. దాంతో ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితులలో నిరుద్యోగ భృతి ఇవ్వడం సాధ్యంకాక ఇవ్వలేదు. నిరుద్యోగ భృతికి ఎవరు అర్హులు…దానికి ఎటువంటి ప్రామాణికత ఉండాలి? విధివిధానాలు ఏవిదంగా ఉండాలి? అనే అంశాలపై అధ్యయనం చేస్తున్న సమయంలో కరోనా వచ్చి పడి అంతా తలక్రిందులు చేసేసింది. అందుకే నిరుద్యోగ భృతి హామీ అమలుచేయలేకపోయాము. కానీ దానిపై వెనక్కు తగ్గేది లేదు. దానిపై ప్రభుత్వం తప్పకుండా ఆలోచన చేస్తుంది కనుక నిరుద్యోగులు దాని గురించి ఆందోళన చెందనవసరం లేదు,” అని అన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ముందూవెనుకా చూడకుండా హామీలు ఇస్తుంటాయి. అప్పుడు ఎటువంటి సమస్యలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు అడ్డురావు. కానీ వాటిని అమలుచేయవలసి వచ్చినప్పుడు అడ్డువస్తున్నాయని చెపుతుంటాయి. ఒకవేళ హామీలు అమలుచేయడానికి సిద్దపడితే వీలైనంత తక్కువ భారంతో బయటపడేందుకుగాను అర్హతలు, విధివిధానాల పేరుతో లబ్దిదారులను తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తుంటాయి.
కరోనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితిని తారుమారు చేసిన మాట వాస్తవం. అయితే అంతమాత్రన్న వందల కోట్ల వ్యయమయ్యే పనులు మానుకోలేదు...ఖర్చులు తగ్గించుకోలేదు. పైగా ఆ భారమంతా ప్రజలపైనే వేసి ముక్కుపిండి మరీ వసూలు చేసుకొంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంచుకుపోతుండటమే అందుకు తాజా నిదర్శనం. ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నప్పుడు దానిలో కొంత తిరిగి ప్రజలకు ఇవ్వడానికి ఏళ్ళ తరబడి ఆలోచిస్తుండటం బాధాకరం.