సాగర్ బరిలో నిలిచేదెవరో...గెలిచేదెవరో?

March 17, 2021


img

నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఈసీ నిన్న షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సరిగ్గా నెలరోజుల తరువాత అంటే ఏప్రిల్ 17న ఉపఎన్నికలు జరుగనున్నాయి. కనుక ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగియక మునుపే రాష్ట్రంలో మళ్ళీ ఉపఎన్నికల హడావుడి మొదలైపోయింది.

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మికంగా మరణించడంతో ఈ ఉపఎన్నికలు జరుగుతున్నందున ఆనవాయితీ ప్రకారం ఆయన భార్య లేదా కుమారుడు భగత్‌కు టికెట్ లభిస్తుందని అందరూ భావిస్తున్నారు. కానీ దుబ్బాక, గ్రేటర్ ఎదురుదెబ్బలతో అప్రమత్తమైన సిఎం కేసీఆర్‌ ఈసారి బలమైన అభ్యర్ధిని నిలబెట్టాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. సాగర్ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నందున ఈసారి బీసీ నేతను బరిలో దించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తద్వారా కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కే.జానారెడ్డిపై ఎన్నికలలో పైచేయి సాధించవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ తేరా చిన్నపరెడ్డి, ఎంసి కోటిరెడ్డిల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌కు ముఖ్యంగా సిఎం కేసీఆర్‌కు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి కనుక సర్వశక్తులు ఒడ్డి పోరాడటం ఖాయం. 

వరుస అపజయాలతో ఢీలాపడిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవం పోసి నిలబెట్టేందుకు కే.జానారెడ్డి అయిష్టంగానే బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు ఎంత ముఖ్యమో తెలుసు కనుక ఆయన కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడటం ఖాయం.

బిజెపి ఎప్పటిలాగే ఇంకా అభ్యర్ధి కోసం వెతుకులాడుతోంది. అయితే తెలంగాణలో బిజెపి టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగి బలపడుతోందని నిరూపించేందుకు ఈ ఉపఎన్నికలలో గెలవడం చాలా ముఖ్యం కనుక బలమైన అభ్యర్ధి కోసం వెతుకులాడుతోంది. ప్రస్తుతం కంకణాల శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత, కడారి అంజయ్య యాదవ్, డాక్టర్‌ రవికుమార్‌ పేర్లను పరిశీలిస్తోంది. త్వరలోనే మూడు పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించనున్నాయి.


Related Post