తెలంగాణ కాంగ్రెస్‌ దుస్థితికి కారణం?

March 17, 2021


img

తెలంగాణ ఏర్పాటు కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టడంతో రెండూ నాశనమైపోయాయని మాజీ కాంగ్రెస్‌ నేత దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్‌ విభజన కారణంగానే నామరూపాలు లేకుండా పోయిందనేది వాస్తవం. కానీ తెలంగాణ ఇచ్చినా తెలంగాణలో కాంగ్రెస్‌ ఎందుకు నష్టపోయింది? అంటే కర్ణుడి చావుకి వేయి శాపాలు...కారణాలు అన్నట్లు తెలంగాణ కాంగ్రెస్‌ దుస్థితికిఅనేక కారణాలు కనబడతాయి.

కాంగ్రెస్ అధిష్టానం చాలా లెక్కలు కట్టుకొనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని అందరికీ తెలుసు. తెలంగాణ ఏర్పాటుతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా తెలంగాణ ఇచ్చినందున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకంతోనే ఇచ్చింది. అలాగే తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే షరతు కూడా విధించింది. కానీ కేసీఆర్‌ను చాలా తక్కువ అంచనా వేయడంతో దాని కాకి లెక్కలన్నీ తప్పాయి.

కేసీఆర్‌ కాంగ్రెస్‌లో టిఆర్ఎస్‌ను విలీనం చేయలేదు కనీసం పొత్తులకు కూడా అంగీకరించలేదు. పైగా తెలంగాణ ఏర్పాటుతో బలంగా ఉన్న తెలంగాణ సెంటిమెంటును తెలివిగా ఉపయోగించుకొని ఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపించుకొన్నారు. అదీగాక 2014లో తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు జరుగుతున్న శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితిని గమనించకుండా…పార్టీని ఏవిదంగా గెలిపించుకోవాలని ఆలోచించకుండా, తమ బందువులకు, అనుచరులకు ఏవిదంగా  టికెట్లు ఇప్పించుకోవాలని ఆలోచించారు. సరిగ్గా అదేసమయంలో పిసిసి అధ్యక్ష పదవి కోసం పట్లు పడుతూ విలువైన సమయాన్ని చేజేతులా వృధా చేసుకొన్నారు. తెలంగాణ ఇచ్చినందున ప్రజలు మరో ఆలోచన లేకుండా గుడ్డిగా తమకే ఓట్లు వేస్తారనే కాంగ్రెస్‌ నేతల గుడ్డి నమ్మకమే వారి కొంపముంచింది. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. ఇన్ని తప్పులు చేసుకొని చేజేతులా కాంగ్రెస్ పార్టీని ముంచుకొని, తెలంగాణ ఏర్పాటు చేయడం వలననే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందని జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు తాపీగా బాధపడటం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా? ఇంకా గమ్మైతైన విషయం ఏమిటంటే నేటికీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆలోచనా తీరులో ఎటువంటి మార్పు లేకపోవడం. పార్టీ దుస్థితిని పట్టించుకోకుండా నేటికీ పిసిసి అధ్యక్ష పదవి కోసం పట్లు పడుతూనే ఉండటమే అందుకు తాజా నిదర్శనం. 


Related Post