టిఆర్ఎస్‌, బిజెపిలకు బీ-టీమ్‌ కాదు.. సొంత టీమే!

March 17, 2021


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ మంగళవారం హైదరాబాద్‌లోని తమ లోటస్‌పాండ్‌ నివాసంలో ఖమ్మం జిల్లా వైసీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు. అలాగే నేను స్థాపించబోయే పార్టీ టిఆర్ఎస్‌ లేదా బిజెపిలకు బీ-టీమ్‌ కూడా కాదు. ఇది పూర్తిగా మన సొంత టీమే. తెలంగాణ ప్రజల కోసం...రాష్ట్రంలో రాజన్నరాజ్యం స్థాపించేందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశ్యం లేదు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం జిల్లాలోనే లక్షమందితో బహిరంగసభ నిర్వహించి అదే రోజున మన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తాను,” అని అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలే టిఆర్ఎస్‌ను ఓడించలేక ఆపసోపాలు పడుతున్నాయి. టిఆర్ఎస్‌ వచ్చిన తరువాత దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజలకు పరిచయమున్న కాంగ్రెస్ పార్టీనే పట్టించుకోవడం లేదు. ఇక రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ ఆంధ్రా నుంచి వచ్చిన వైఎస్ షర్మిళను ప్రజలు అదరిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఈవిషయం షర్మిళకు తెలియదనుకోలేము. కనుక ఆమె రాక వెనుక ఏదో బలమైన రాజకీయ కారణం ఉందని భావించవచ్చు. ఆంధ్రాకు చెందిన ఆమె ఆంద్రా ప్రజల గురించి ఆలోచించకుండా తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నానని చెప్పడం నమ్మశఖ్యంగా లేదు. ఇప్పటికే ఫిరాయింపులతో, వరుస ఓటములతో బలహీనపడిన కాంగ్రెస్ పార్టీని ఆమె నిలువునా చీల్చేందుకు వచ్చారా?తెలంగాణ సెంటిమెంట్ రగించడం ద్వారా రాష్ట్రంలో హిందూ సెంటిమెంటుతో దూసుకుపోతున్న బిజెపికి చెక్ పెట్టి టిఆర్ఎస్‌కు సాయపడేందుకు వచ్చారా? టిఆర్ఎస్‌ను దెబ్బ తీయడానికి బిజెపి పంపితే వచ్చారా?అనేది రానున్న రోజులలో మెల్లమెల్లగా బయటపడుతుంది.


Related Post