గులాబీ, కాషాయం, పసుపు రగడ

March 16, 2021


img

కేంద్రప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, సమాధానాలతో రాష్ట్రస్థాయి బిజెపి నేతలు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు గురించి టిఆర్ఎస్‌ ఎంపీ కె.సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయమంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానమే అందుకు తాజా నిదర్శనం. “ఇప్పటికే హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలలో సుగంధ ద్రవ్యాల ఎగుమతి బోర్డుకు సంబందించిన కార్యాలయాలున్నాయి. వాటి ద్వారానే పసుపు అమ్మకాలు కూడా జరుగుతున్నందున తెలంగాణలో కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన, ప్రతిపాదన లేదు,” అని సమాధానమిచ్చారు. 

దీంతో రాష్ట్రంలో మళ్ళీ గులాబీ, కాషాయ పార్టీల మద్య పసుపు రగడ మొదలైంది. లోక్‌సభ ఎన్నికలప్పుడు నిజామాబాద్‌ నుంచి పోటీ చేసి గెలిచిన ధర్మపురి అర్వింద్ తనను గెలిపిస్తే నెలరోజుల్లో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని స్టాంప్ పేపరు మీద లిఖితపూర్వకంగా రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. దాంతో జిల్లాలోని పసుపు రైతులు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 

అప్పటి నుంచే రాష్ట్రంలో బిజెపి నేతలు రెచ్చిపోయి సిఎం కేసీఆర్‌...రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటం, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను దెబ్బతీయడంతో బిజెపిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు టిఆర్ఎస్‌ సమయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు పసుపుబోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రమంత్రి చెప్పిన సమాధానంతో టిఆర్ఎస్‌కు ఆ అవకాశం వచ్చింది. 

దానిపై బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ సంజాయిషీ ఇవ్వాలని టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బోర్డు ఏర్పాటుచేయకపోతే రాజీనామా చేస్తానని శపధం చేశారు కదా... ఇప్పుడు రాజీనామా చేస్తారా? పసుపుబోర్డు కోసం ఉద్యమిస్తారా?లేదా కేంద్రమంత్రిని నిలదీసి అడుగుతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇస్తానన్న ప్రాజెక్టులు కూడా ఇవ్వకుండా బిజెపి తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. 



Related Post