ప్రతిపక్షాలు ఓటమి అంగీకరిస్తున్నాయా?

March 16, 2021


img

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు బుదవారం వెలువడనున్నాయి. కాంగ్రెస్‌, బిజెపి, టిజేఎస్‌తో సహా ప్రతిపక్షాలన్నీ ఈ ఎన్నికలలో తామే విజయం సాధించబోతున్నామని చెప్పుకొంటున్నప్పటికీ, అధికార టిఆర్ఎస్‌ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టారని, తమపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నాయి. కానీ టిఆర్ఎస్‌ మాత్రం ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని చెపుతోంది. రెండు ఎమ్మెల్సీ సీట్లను తామే గెలుచుకోబోతున్నామని టిఆర్ఎస్‌ నమ్మకంగా చెపుతోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలతో అవి ముందే ఓటమిని అంగీకరించాయని టిఆర్ఎస్‌ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో కంటే ఈసారి రెండు నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరగడంపై కూడా అధికార, ప్రతిపక్షాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావుల పిలుపు మేరకు టిఆర్ఎస్‌ అభ్యర్ధులను గెలిపించేందుకే భారీ సంఖ్యలో ఓట్లర్లు తరలివచ్చారని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. కానీ ఎన్నికల హామీలు అమలుచేయకుండా మాయమాటలతో మభ్యపెట్టాలని చూస్తున్న సిఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసేందుకు భారీగా ఓటర్లు తరలివచ్చారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వాదిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాల వాదనలలో ఏది నిజమో రేపు ఫలితాలు వెలువడితే తేలిపోతుంది.  


Related Post