బిజెపిని ఎందుకు పిలవలేదో?రఘునందన్ రావు

March 15, 2021


img

నేడు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి. ఆ తరువాత శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)సమావేశం జరిగింది. బీఏసీ సమావేశంలో ఈ నెల 26వరకు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 18న బడ్జెట్‌ ప్రవేశపెట్టి, 20 నుంచి దాని పద్దులపై చర్చించనున్నారు. ఈనెల 26న ద్రవ్యవినిమయబిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. 

బీఏసీ సమావేశానికి బిజెపి సభ్యులను ఆహ్వానించకపోవడంపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లోక్‌సత్తా తరపున జయప్రకాష్ నారాయణ్ ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఏసీ సమావేశానికి ఆయనను ఆహ్వానించారని కానీ ఇప్పుడు బిజెపికి ఇద్దరు శాసనసభ్యులున్నప్పటికీ ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. దీనిని బట్టి బడ్జెట్‌ సమావేశాలు సిఎం కేసీఆర్‌ కనుసన్నలలో ఏకపక్షంగా సాగబోతున్నాయని ఇప్పుడే స్పష్టమైందని అన్నారు. రేపు శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి దీనిపై ఫిర్యాదు చేస్తానని రఘునందన్ రావు అన్నారు. 

ఆయన పిర్యాదును స్పీకర్ పట్టించుకోకపోయినప్పటికీ, మంచి వాగ్ధాటి, అపార రాజకీయ అనుభవం కలిగిన  రఘునందన్ రావు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం ఖాయమనే భావించవచ్చు.


Related Post