ఎన్టీఆర్‌కి రాజకీయాలపై ఇంకా ఆసక్తి ఉందనుకోవాలా?

March 13, 2021


img

జూనియర్ ఎన్టీఆర్ అటు సినీ పరిశ్రమలో ఇటు రాజకీయాలలోనూ పరిచయం అవసరం లేని వ్యక్తి. అయితే అందరికీ తెలిసిన కారణాల చేత ఆయన 2009 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించినప్పుడు ఎన్టీఆర్‌ని మళ్ళీ పార్టీలోకి తీసుకురావాలలంటూ ఆయన అభిమానులు బ్యానర్లు కట్టి...ఫోటోలు పెట్టి మరీ నిలదీసి అడిగారు. కానీ బాబు సమాధానం చెప్పకుండా తప్పించుకొన్నారు. అది వేరే సంగతి. కానీ అప్పటి నుంచి ఎన్టీఆర్‌ రాజకీయ పునఃప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే తన రాజకీయ పునః ప్రవేశంపై అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్‌ చెప్పిన సమాధానం వింటే ఆయనకు రాజకీయాలలో రావలనే ఆసక్తి ఉందని, కానీ సరైన సమయం, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తుంది.

త్వరలో జెమినీ టీవీలో ప్రారంభం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ రియాల్టీ షోకి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆ షో ప్రమోషన్‌లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి “మీరు మళ్ళీ రాజకీయాలలోకి వస్తున్నారా? అయితే ఎప్పుడు వస్తారు?” అని ప్రశ్నించాడు. దానికి ఎన్టీఆర్‌ ఏమన్నారంటే, “ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి. నేనేమి సమాధానం చెపుతానో మీకూ తెలుసు. అయినా ఇది రాజకీయాల గురించి చర్చించుకొనే సమయం, సందర్భమూ కాదు కనుక మళ్ళీ ఎప్పుడైనా తాపీగా దీని గురించి మాట్లాడుకొందాము,” అని సమాధానం దాటవేశారు. 

ఒకవేళ ఎన్టీఆర్‌కి మళ్ళీ రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యమే లేకపోతే అదే విషయం మిగిలిన హీరోలు చెప్పినట్లే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయవచ్చు. కానీ తన రాజకీయ ప్రవేశం గురించి ‘తరువాత తాపీగా మాట్లాడుకొందాము,’ అని చెప్పడం ద్వారా ఇంకా ఆ ఆసక్తి ఉన్నట్లే అనిపిస్తోంది. కానీ ఎప్పుడు..ఏవిదంగా...అనేది ప్రస్తుతానికి సస్పెన్స్! 


Related Post