భారత్‌లో మళ్ళీ బారీగా కరోనా కేసులు నమోదు

March 13, 2021


img

భారత్‌లో మళ్ళీ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తగా 24,882 పాజిటివ్ కేసులు నమోదు కాగా 140 మంది కరోనా సోకి మరణించారని కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దాదాపు రెండున్నర నెలలుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి పరిస్థితి పూర్తి నియంత్రణలోకి రావడంతో ఇక కరోనా మహమ్మారి బెడద వదిలిపోయినట్లేనని అందరూ సంతోషించారు. దాంతో అటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కూడా కరోనా పట్ల అలసత్వం ప్రదర్శించడంతో పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయి.

కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా గురించి బొత్తిగా అవగాహన లేనప్పుడు, దానికి మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోలేనప్పుడు ప్రజలు, ప్రభుత్వాలు చాలా అప్రమత్తంగా ఉంటూ కరోనాను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ మహమ్మారి వలన కలిగే అనర్ధాల గురించి సామాన్య ప్రజలకు సైతం పూర్తి అవగాహన ఏర్పడి, మందులు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత దేశంలో మళ్ళీ కరోనా మహమ్మారి ఈస్థాయిలో విజృంభించడానికి ప్రజలు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం లేదా నిర్లక్ష్యమే కారణమని చెప్పక తప్పదు.     

ఈ రెండో దశలో కూడా మళ్ళీ మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రాజధాని ముంబైతో సహా నాగపూర్, పూణే, ఔరంగాబాద్, థానే, నాసిక్ తదితర జిల్లాలో కొన్ని చోట్ల పూర్తిగా కొన్నిచోట్ల పాక్షికంగా లాక్‌డౌన్‌ విధించింది. 

కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం... 

దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు: 1,13,33,728

 కరోనా నుంచి కోలుకొన్నవారి సంఖ్య: 1,09,73,260

కరోనా మృతుల సంఖ్య: 1,58,446

యాక్టివ్ కేసుల సంఖ్య: 2,02,022

రికవరీ రేటు: 96.82 


Related Post