కేంద్రానికి మద్దతు ఇస్తాం...అవసరమైతే పోరాడుతాం: హరీష్ రావు

March 12, 2021


img

'టిఆర్ఎస్‌-బిజెపిలది గల్లీలో కుస్తీ...ఢిల్లీలో దోస్తీ...' అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆర్ధిక మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “అవసరమైనప్పుడు జాతీయ దృక్పదంతో కేంద్రప్రభుత్వానికి కొన్ని సందర్భాలలో మద్దతు ఇస్తాము. కానీ రాష్ట్రానికి నష్టం కలుగుతుందంటే కేంద్రప్రభుత్వంతో నిర్మొహమాటంగా పోరాడుతాము. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వస్తే భారీగా ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేసి ప్రైవేటీకరణ చేస్తామని చెపుతూ ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టేందుకు సిద్దం అవుతోంది. ఈ విషయంలో కేంద్రప్రభుత్వాన్ని మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నాము. ఒకవేళ రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉండి ఉంటే టీఎస్‌ఆర్టీసీతో సహా అన్ని సంస్థలను అమ్మిపడేసేదే. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనతో బిజెపిపై ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో ఏదో అదృష్టం కొద్దీ గాలివాటంగా బిజెపి గెలిచింది. వాపును చూసి బలుపు అనుకొంటున్న బిజెపికి త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో, నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో ఓటమి ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధులిద్దరూ ఘన విజయం సాధించడం ఖాయం. అప్పుడే బిజెపికి తన పరిస్థితిపై పూర్తి స్పష్టత వస్తుంది,” అని అన్నారు.


Related Post