ఆంధ్రా ఓటర్లకు గాలం వేసేందుకే కేటీఆర్‌ ప్రకటన

March 12, 2021


img

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటాలకు మంత్రి కేటీఆర్‌ మద్దతు ప్రకటించడంపై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి, సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఘాటుగా స్పందించారు. 

రేవంత్‌ రెడ్డి మంత్రి నిన్న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆంధ్రా ఓటర్లకు గాలం వేసేందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న పోరాటాలకు కేటీఆర్‌ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయచట్టాలను, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, టిఆర్ఎస్‌ ఎంపీలు కనబడకుండా మాయమైపోయారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్‌ మంత్రులు కేంద్రప్రభుత్వంపై విమర్శిస్తూ బిజెపి తమకు శత్రువు అన్నట్లు ప్రజలను భ్రమింపజేస్తున్నారు. దీంతో టిఆర్ఎస్‌-బిజెపిలది గల్లీలో కుస్తీ...ఢిల్లీలో దోస్తీ అని మరోసారి నిరూపితమైంది. 

విభజన హామీల అమలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా, ఇంకా ఇతర అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీసేందుకు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేద్దామని కేటీఆర్‌ను కోరితే స్పందన లేదు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో పోరాడటానికి ఇష్టపడని టిఆర్ఎస్‌ విశాఖ ఉక్కు గురించి కేంద్రంతో పోరాడుతుందంటే నమ్మశక్యంగా ఉందా?” అని ప్రశ్నించారు. 

దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, “కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తానన్నట్లుంది మంత్రి కేటీఆర్‌ ప్రకటన. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆంద్రా ఓటర్లను ఆకట్టుకొనేందుకే ఆ ప్రకటన చేసినట్లు భావిస్తున్నాము. నిరుద్యోగ భృతి, వరద బాధితులకు రూ.10,000 ఆర్ధికసాయం హామీలను అమలుచేయలేరు కానీ పక్క రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కోసం పోరాడుతానంటున్నారు,” అని ఎద్దేవా చేశారు.


Related Post