నాగపూర్‌లో మళ్ళీ లాక్‌డౌన్‌

March 11, 2021


img

మహారాష్ట్రలోని నాగపూర్‌లో మళ్ళీ కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ నెల 15 నుంచి 21 వరకు వారం రోజులపాటు పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు నగర మునిసిపల్ కమీషనర్ రాధాకృష్ణన్ తెలిపారు. గతంలోలాగే లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలెవరూ ఇళ్ళలో నుంచి బయటకు రారాదని, కేవలం అత్యవసరమైతేనే పోలీసుల అనుమతితో బయటకురావాలని చెప్పారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకుండా చాలా నిర్లక్ష్యంగా తిరుగుతున్నందునే నగరంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరిగిందన్నారు. ఆయా ప్రాంతాలలో పాక్షికంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటికీ నిన్న ఒకేరోజున ఏకంగా 1,710 పాజిటివ్ కేసులు నమోదవడంతో మళ్ళీ పూర్తిస్థాయిలో నగరమంతటా వారంరోజుల పాటు లాక్‌డౌన్‌ విధించకతప్పడంలేదని మునిసిపల్ కమీషనర్ రాధాకృష్ణన్ తెలిపారు. కనుక ఇకనైనా ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ, పోలీసులు, మునిసిపల్, ఆరోగ్య సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.           

ఇది ఒక్క నాగపూర్‌ లేదా మరో నగరానికి సంబందించిన విషయం అనుకొంటే పొరపాటే. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా చాలా మంది ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే బహిరంగ ప్రదేశాలలో యాదేచ్చగా తిరుగుతున్నారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. మళ్ళీ పాజిటివ్ కేసులు పెరిగినట్లయితే లాక్‌డౌన్‌ అనివార్యమని స్పష్టం అవుతోంది కనుక అటువంటి పరిస్థితి రాకుండా అందరూ ముందే జాగ్రత్తలు పాటిస్తే మంచిది.


Related Post