కాంగ్రెస్‌కు కూడా కోదండరాం విరోధి అయిపోయారా?

March 11, 2021


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ జనసమితి (టిజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంల మద్య మంచి స్నేహసంబంధాలునందునే ఆ రెండు పార్టీలు కలిసి గతంలో అనేకసార్లు ప్రజాసమస్యలపై పోరాడాయి. ఆ తరువాత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జనసమితి పొత్తులు పెట్టుకొని పోటీ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎన్నికలలో రెండు పార్టీలు ఘోరంగా ఓడిపోవడంతో అప్పటి నుంచి వాటి మద్య దూరం పెరిగింది.

అయితే వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం పాత పరిచయాలను, స్నేహాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతూ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఓ లేఖ వ్రాశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ స్థానానికి రాములు నాయక్‌ను అభ్యర్ధిగా ప్రకటించి కోదండరాంకు షాక్ ఇచ్చింది. కనుక ఇప్పుడు కాంగ్రెస్‌, టిజేఎస్‌ పార్టీల మద్య కూడా పోటీ నెలకొంది. దీంతో పరస్పరం విమర్శించుకోక తప్పడం లేదు.

కాంగ్రెస్‌ అధ్వర్యంలో బుదవారం నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం జరిగింది. దానిలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ కోదండరాంకు హైదరాబాద్‌లో ప్రజాధారణ ఉంది. కానీ ఆయన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు?ఆయన కాంగ్రెస్‌ ఓట్లు చీల్చి టిఆర్ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారని భావిస్తున్నాము,” అని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే సిఎం కేసీఆర్‌ 29 ఫిట్‌మెంట్‌ ఇస్తామంటూ ఉద్యోగ సంఘాల నేతల ద్వారా మీడియాకు లీకులు ఇస్తున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కానీ ఎన్నికలయ్యాక మళ్ళీ ఆ హామీని అటకెక్కించేస్తారని అప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు తమ సాటి ఉద్యోగులకు ఏమని సమాధానం చెపుతారని ప్రశ్నించారు. సిఎం కేసీఆర్‌ మాయలో పడి మోసపోవద్దని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలకు హితవు పలికారు. 


Related Post