అవును... ప్రైవేట్‌ స్కూల్ టీచర్స్‌ను ఆదుకోలేకపోయాము: కేటీఆర్‌

March 09, 2021


img

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ మంగళవారం సికింద్రాబాద్‌లోని మహబూబా కాలేజీలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీ ఉపాద్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “విద్యార్దుల క్షేమం కోరి రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు మూసివేయక తప్పలేదు. దాని వలన మీ అందరూ చాలా కష్టాలు సమస్యలు ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి కానీ రాష్ట్రంలో 12 లక్షల మంది ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించదని మౌనం వహించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి బాగోలేనందున మిమ్మల్ని ఆదుకోలేకపోయాము. దీనికి మేము కూడా చాలా బాధపడుతున్నాము. దీనిపై మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు అవి పాలిస్తున్న రాష్ట్రాలలో ఎంతమంది ప్రైవేట్ టీచర్లను ఆదుకొన్నాయో చెప్పగలవా? అని నేను ప్రశ్నిస్తున్నాను,” అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 

కరోనా కారణంగా గత ఏడాది మార్చి నెల నుంచి హటాత్తుగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. నేటికీ కరోనా భయంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధమిక పాఠశాలలు తెరిచే సాహసం చేయలేకపోతున్నాయి. కనుక తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో లక్షలాదిమంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు రోడ్డున పడి కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు ఒంటిపై ఉన్న కొద్ది పాటి బంగారాన్ని అమ్ముకోగా చాలామంది ఉపాధ్యాయులు తమకు అలవాటులేని రోజు కూలీ పనిచేస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. ఉపాధ్యాయులు రోడ్లపై తోపుడుబళ్ళపై కూరలు, పళ్ళు అమ్ముకొంటున్నారు. మరికొంతమంది ఉపాధ్యాయులు తమ భార్యాపిల్లల  సాయంతో రోడ్లపక్కన టిఫిన్ సెంటర్లు పెట్టుకొని భారంగా జీవనం కొనసాగిస్తున్నారు. దేశానికి భావిభారతపౌరులను అందించవలసిన గురువులు ఇంత దయనీయస్థితిలో ఉంటే వారిని ఆదుకొనేనాధుడు లేదు...వారి గోడు వినేవారు లేకుండాపోయారు. కానీ ఇప్పుడు అన్ని పార్టీలకు వారి ఓట్లు అవసరం పడ్డాయి!


Related Post