టిఆర్ఎస్‌ పాలన పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా?

March 09, 2021


img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మొదటి నుంచి సిఎం కేసీఆర్‌ వైఖరి, నిర్ణయాలు, పాలన పట్ల అసంతృప్తిగానే ఉన్నారనే విషయం రహస్యమేమీ కాదు. కానీ గతంలో సిఎం కేసీఆర్‌...టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నందున నేరుగానే విమర్శిస్తున్నారు. మంగళవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. వారికి తమ అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అవకాశంగా వచ్చాయి కనుక సరైన తీర్పు ఇస్తారని భావిస్తున్నాను,” అని అన్నారు. 

సమైక్య రాష్ట్రంలో దశాబ్ధాలుగా వివక్షను ఎదుర్కొంటూ అభివృద్ధికి నోచుకోని తెలంగాణ, ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాతే అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోందనేది కళ్ళకు కనబడుతున్న నిజం. సిఎం కేసీఆర్‌ నిరంకుశ వైఖరి, కొందరు టిఆర్ఎస్‌ ప్రజాప్రతినిధులు తీరు పట్ల ప్రజలలో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌ ప్రభుత్వం...ప్రతిపక్షాలతో ఏవిదంగా వ్యవహరిస్తున్నారనేది సామాన్య ప్రజలకు అనవసరం. రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తూ, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారా లేదా అనేదే వారు చూస్తారు. ఆ విషయంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడానికి లేదు కనుక ప్రజలు అసంతృప్తితో ఉన్నారనుకోలేము. 

ఎన్నికల సమయంలో ఏ పార్టీ ఎటువంటి వ్యూహాలను అవలంభిస్తుంది? వాటితో ఎవరు ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేయగలుగుతారు? అనేవే ఫలితాలను నిర్ణయిస్తున్న ఈరోజుల్లో ఎన్నికల ఫలితాలు పాలకులకు...వారి పాలనకు గీటురాయని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ప్రజాస్వామ్యవిధానంలో గెలిచినవారికే ప్రజల మద్దతు ఉందని చెప్పుకొంటారు... అలాగే భావించాల్సి వస్తోంది. కనుక ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిస్తే ప్రతిపక్షాల వాదనలన్నీ తప్పే అనుకోవలసి ఉంటుంది. ఒకవేళ ప్రొఫెసర్ కోదండరాం గెలిస్తే ఆయన అభిప్రాయాలే సరైనవని చెప్పుకోవలసి ఉంటుంది. 


Related Post