ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అవి ఎన్నికలలో పైచేయి సాధించడం కోసం జరుగుతున్నవే తప్ప వాటి నుంచి ఎటువంటి పరిష్కారాలు రావని అందరికీ తెలుసు. అయితే నానాటికీ పెరిగిపోతున్న ఈ నిరుద్యోగసమస్యకు పరిష్కారమే లేదా? అంటే ఉంది.
అందరూ ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూడకుండా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు చేసేందుకు సిద్దపడాలి. ముఖ్యంగా విద్యార్దులు, యువత తమ దోస్తులు ఇంజనీరింగ్‌లో చేరుతున్నారని గుడ్డిగా దానిలో చేరిపోకుండా తమ అభిరుచి, కుటుంబ ఆర్ధిక స్థోమతను బట్టి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలున్న వివిద రకాల కోర్సులను ఎంచుకోవలసి ఉంటుంది.
ఉదాహరణకు నాలుగేళ్ళు కష్టపడి ఇంజనీరింగ్ చేసినా మళ్ళీ ఏదో ఓ సాఫ్ట్‌వేర్ కోర్సు నేర్చుకొంటే తప్ప ఉద్యోగాలు రానప్పుడు మూడేళ్ళలో బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తే తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో బయటపడి ఏడాది ముందుగానే ఉద్యోగం సంపాదించుకోవచ్చు కదా?కరోనా పుణ్యమాని ఇప్పుడు ఫార్మా రంగంలో అనేక ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. కనుక ఆ రంగంలో ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను ఎంచుకొంటే మంచిది కదా?
ఒకప్పుడు చదువు అబ్బకపోతే జీవితంలో ఇక పైకిరారనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు చదువులతో సంబందం లేకుండా పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్, కార్పెంటర్, టైల్స్ ఫిక్సింగ్, ఫాల్స్ సీలింగ్, ఏసీ, ఫ్రిజ్ మెకానిక్, టీవీ, మొబైల్ రిపేర్, వెబ్ డిజైనింగ్, కార్ డ్రైవింగ్, చివరికి వంటలు, హౌస్ కీపింగ్, కార్, బైక్ వాషింగ్ వంటి ఏపని నేర్చుకొన్నా చాలు. దాంతోనే బాగా సంపాదించుకొంటూ దర్జాగా జీవిస్తూ మరో పదిమందికి ఉపాధి కూడా కల్పిస్తున్న యువత మన చుట్టుపక్కలే చాలా మంది కనిపిస్తుంటారు.
హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు కనిపిస్తుంటాయి. అవి ఎప్పుడూ కిటకిటలాడుతుంటాయి. వాటిలో కనీసం నలుగురైదుగురు పనిచేస్తుంటారు. వారిలో ఉన్నత చదువులు చదువుకొన్నవారున్నారు పదో క్లాసు ఫెయిల్ అయినవారూ ఉన్నారు. కానీ దాంతో వారందరూ దాంతో స్వయంఉపాది పొందుతున్నారని స్పష్టం అవుతోంది.
ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగాలు చేయాలనుకోవడమే తప్పు కాదు. కానీ వాటి కోసమే ఎదురుచూపులు చూస్తూ యువత తమ విలువైన సమయాన్ని వృదా చేసుకోకుండా స్వయం ఉపాదికి ప్రయత్నించడం చాలా మంచిది. ఇప్పుడు మన దేశంలో...రాష్ట్రంలో పైన చెప్పిన రకరకాల పనులలో నైపుణ్యం ఉన్నవారికి చాలా డిమాండ్ ఉంది. కనుక విద్యార్దులు...ముఖ్యంగా నిరుద్యోగ యువత ఈ దిశలో ముందుకు సాగితే మంచిది.