నిరుద్యోగులందరికీ ప్రభుత్వోద్యోగాలు సాధ్యమా?

March 09, 2021


img

ఈనెల 14న తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగబోతున్నందున, అధికార ప్రతిపక్షాల చర్చ అంతా విద్య, ఉద్యోగాల భర్తీ అనే రెండు అంశాల చుట్టూనే తిరుగుతోంది. టిఆర్ఎస్‌ ప్రభుత్వం గత ఆరున్నరేళ్ళలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాకి లెక్కలు చెపుతూ ప్రజలను మభ్యపెడుతోందని ప్రతిపక్షాలు వాదిస్తుంటే, గత ఆరున్నరేళ్ళలో 1,33,000  ఉద్యోగాలు భర్తీ చేశామని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకపోవడం వలననే నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ప్రతిపక్షాలు వాదిస్తుంటే, ప్రైవేట్ కంపెనీల ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నారు. 

నిజానికి ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ దేశంలో లేదా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించలేదని అందరికీ తెలుసు. ఇది కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వాలు పరిపాలన కొనసాగించేందుకు, విద్య, వైద్యం, విద్యుత్, పోలీస్ వంటి కొన్ని ముఖ్యమైన విభాగాలకు అవసరమైనంతమంది ఉద్యోగులు లేదా సిబ్బందిని మాత్రమే  నియమించుకోగలవు కానీ నిరుద్యోగులందరికీ వాటిలో ఉద్యోగాలు కల్పించలేవు.

ఒకవేళ ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వివిద శాఖలలో...విభాగాలలో అన్ని ఉద్యోగాలను నూటికి నూరు శాతం భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరిపోదని అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ శాఖలు వాటి విభాగాలలో మహా అయితే మరో 1-2 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి కానీ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 10-15 లక్షలకు పైనే ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. ఆ సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎన్నటికీ తగ్గదు.

కనుక ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వలన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని వాదించడం వితండవాదమే. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు, నిరుద్యోగులతో కనెక్ట్ అవ్వాలంటే ఈ సమస్యపైనే చర్చిస్తుండాలి కనుకనే ఆధికార, ప్రతిపక్షపార్టీలు దీనిపై వాదోపవాదాలు చేసుకొంటున్నాయని చెప్పవచ్చు. కనుక ఈ ఎన్నికలు ముగియగానే ఈ చర్చలు కూడా అటకెక్కిపోవడం ఖాయం. నిరుద్యోగ సమస్య మాత్రం నానాటికీ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటిలాగే!


Related Post