దాదాపు వందకు పైగా ప్రభుత్వ రంగసంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరణ చేస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. వాటిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఒకటి. ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేసినప్పటి నుంచి ఈ అంశంపై ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మద్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపద్యంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దీని గురించి లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రస్తుతం పోరాడుతున్నవారిని మరింత రెచ్చగొడుతున్నట్లుంది.
“వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో నూటికి నూరుశాతం ప్రభుత్వ వాటాలను ఉపసంహరించుకొని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించాము. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెంచాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నాము. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదు...దీనిలో రాష్ట్రానికి ఎటువంటి వాటా లేదు,” అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
ఇప్పటికే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉదృతంగా ఆందోళనలు సాగుతున్నాయి. బహుశః ప్రజాగ్రహానికి గురికాకూడదనే ఉద్దేశ్యంతో అధికార వైసీపీ కూడా కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదంటూ నిర్మలా సీతారామన్ క్లీన్ చిట్ ఇచ్చినందున బహుశః రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెనక్కు తగ్గుతుందేమో?
అయితే ఈ సమస్య ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేదా ఏపీకి సంబందించిన సమస్య మాత్రమే కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేశంలో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో ఇది తొలి అడుగు మాత్రమే. రేపు తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడం తధ్యం.
నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికల గంట మ్రోగిన తరువాత కూడా కేంద్రప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా నిర్భయంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుండటం చాలా ఆశ్చర్యకరమే.