కేంద్రం తలుచుకొంటే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయలేదా?

March 08, 2021


img

ఎమ్మెల్సీ ఎన్నికల నేపధ్యంలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశంపై టిఆర్ఎస్‌, బిజెపిలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో దేనివాదనలు నిజమో ఆలోచించవలసిన సమయం ఇది.  

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి నిన్న హన్మకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, “2016లో కేంద్రం కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది కానీ దాని ఏర్పాటుకు అవసరమైన 125 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేకపోయింది. దానికి రాష్ట్ర వాటాగా నిధులు కూడా ఇవ్వలేదు. అందుకే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకాలేదు. కానీ కేంద్రమే ఏకపక్షంగా రద్దు చేసిందని టిఆర్ఎస్‌ నేతలు అబద్దాలు చెపుతున్నారు,” అని అన్నారు. 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెపుతున్నట్లు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వడం ఆలస్యం చేసినా దానిని రద్దు చేయవలసిన అవసరం ఏమిటి? అయినా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వందలు...వేలఎకరాలు కేటాయిస్తూ వాటిని ఆకర్షించి రాష్ట్రానికి రప్పిస్తున్నప్పుడు, సుమారు 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించే కోచ్ ఫ్యాక్టరీ కొరకు 125 ఎకరాలు ఎందుకు ఇవ్వదు? కోచ్ ఫ్యాక్టరీ  ఏర్పాటుచేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుకొంటుంది? ప్రభుత్వ రంగసంస్థలను వదిలించుకోవాలని చూస్తున్న కేంద్రం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఏర్పాటు చేస్తుంది?అని ఆలోచిస్తే బిజెపి వాదనలు ఎంత అర్ధరహితమో తెలుస్తుంది. టిఆర్ఎస్‌ను నిందిస్తూ బిజెపి తప్పించుకోవాలనుకొంటున్న విషయం ప్రజలు గ్రహించలేరనుకోవడం అవివేకమే కదా? 


Related Post