పీవీ కుమార్తెకు ముస్లిం ఓట్లు పడతాయా?

March 06, 2021


img

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా సురభి వాణీదేవి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు కుమార్తె కావడంతో ముస్లిం ఓటర్లు ఆమెకు ఓట్లు వేస్తారా లేదా?అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మజ్లీస్ పార్టీ ఆమెకు సహకరించే పరిస్థితి కనబడటం లేదు. స్వర్గీయ పీవీ నరసింహారావు హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేయబడినందున ఆయన పట్ల ముస్లిం ప్రజలలో కొంత వ్యతిరేకత నెలకొని ఉంది. బాబ్రీ విషయంలో మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బాహాటంగానే కాంగ్రెస్‌, బిజెపిలపై విమర్శలు గుప్పిస్తుంటారు.

అదీగాక...ఈసారి ఈ ఒక్క స్థానానికి అధికార, ప్రతిపక్ష పార్టీలతో సహా మొత్తం 93 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వారిలో ముస్లిం అభ్యర్ధులు చాలామందే ఉన్నారు. ఈ ఎన్నికలలో మజ్లీస్‌ పోటీ చేయనప్పటికీ వారిని కాదని  పీవీ కుమార్తె వాణీదేవికి మద్దతు ఇస్తుందనుకోలేము. అలాగే ముస్లిం ఓటర్లు కూడా ముస్లిం అభ్యర్ధులకే ప్రాధాన్యం ఇస్తారు తప్ప వాణీదేవికి ఈయకపోవచ్చు.

ఈ నియోజకవర్గం నుంచి ఎన్‌.రామచందర్ రెడ్డి (బిజెపి), చిన్నారెడ్డి (కాంగ్రెస్‌) ప్రొఫెసర్ నాగేశ్వర్ (వామపక్షాలు) ఇంకా పలువురు బలమైన స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. కనుక సురభి వాణీదేవికి వారి నుంచి గట్టి పోటీ ఉంటుంది కనుక ఎదురీత తప్పకపోవచ్చు. కానీ ఆమెను గెలిపించుకొనేందుకు టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ గట్టిగా కృషి చేస్తున్నారు.


Related Post