సిఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు

March 05, 2021


img

తెలంగాణ రాష్ట్రంలో గత మూడు నాలుగేళ్ళుగా సిఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసే ఆనవాయితీ బాగా పెరిగిందని చెప్పవచ్చు. కానీ గమ్మతైన విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల వలన లాభపడినవారితో పాటు నష్టపోయి, మళ్ళీ ప్రభుత్వ హామీ పొందినవారు కూడా సిఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తుండటం! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వానికి మద్య... ప్రభుత్వం అనే కంటే...వారికీ సిఎం కేసీఆర్‌కు మధ్య భీకర యుద్ధమే జరిగింది. కానీ చివరికి ఆర్టీసీ కార్మికులే సిఎం కేసీఆర్‌ చిత్రపతాలకు పాలాభిషేకాలు చేసి బేషరతుగా ఉద్యోగాలలో చేరడం అందరికీ తెలుసు. 

తాజాగా యాదాద్రి ఆలయ రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయినవారు జీవనోపాధి కోల్పోయి కుటుంబాలతో సహా రోడ్డునపడే పరిస్థితి ఏర్పడింది. కానీ నిన్న సిఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన సందర్భంగా వారందరికీ పెద్ద షోరూములకు తీసిపోనివిదంగా అన్ని వసతులతో సువిశాలమైన షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు... వారందరికీ 200 గజాల చొప్పున ఇళ్ళ స్థలాలు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కొండపై దుకాణాలున్నవారికి పాతపద్దతిలోనే దుకాణాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారందరూ సంబురాలు చేసుకొని సిఎం కేసీఆర్‌ చిత్రపతాలకు పాలాభిషేకాలు చేశారు. తనను విమర్శించినవారిచేతే పాలాభిషేకాలు చేయించుకోగలగడం బహుశః సిఎం కేసీఆర్‌కి మాత్రమే సాధ్యమేమో?


Related Post