బిజెపిపై టిఆర్ఎస్‌ ఎదురుదాడి... జవాబే లేదు!

March 05, 2021


img

మార్చి 14న జరుగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతిని అస్త్రాలుగా చేసుకొని టిఆర్ఎస్‌తో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. వాటికి మంత్రి కేటీఆర్‌ గణాంకాలతో సమాధానం చెప్పినప్పటికీ, ఈ ఆంశంపై ఆ రెండు పార్టీలు చేస్తున్న వాదనలే పట్టభద్రులను ముఖ్యంగా...నిరుద్యోగులను ఆకట్టుకొంటాయని టిఆర్ఎస్‌ గ్రహించినట్లే ఉంది. బహుశః అందుకే టిఆర్ఎస్‌ కూడా ఈవిషయంలో రూటు మార్చి కాంగ్రెస్‌, బిజెపిలపై ఎదురుదాడి ప్రారంభించింది.

ఇప్పుడు టిఆర్ఎస్‌ నేతలందరూ గత ఆరేళ్ళలో మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన హామీ ఏమైందని టిఆర్ఎస్‌ నేతలు నిలదీస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో...దేశంలో ప్రభుత్వ రంగసంస్థలలో పెట్టుబడులు ఉపసంహరించుకొని ప్రైవేటీకరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. రాష్ట్రంలో బిజెపి దూకుడుతో ఇబ్బందిపడుతున్న టిఆర్ఎస్‌కు మోడీ చేసిన ఈ ప్రకటన యుద్ధసమయంలో బలమైన ఆయుధంలా అందివచ్చింది. దాంతో టిఆర్ఎస్‌ నేతలు బిజెపిని చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగాలు కల్పిస్తామని హామీతో అధికారంలోకి వచ్చిన బిజెపి, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని గట్టిగా వాదిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే బడుగుబలహీనవర్గాల రిజర్వేషన్లు ఉండి ఏం ప్రయోజనమని, అప్పుడు వారి పరిస్థితి ఏమిటని నిలదీస్తున్నారు.

హైదరాబాద్‌లో ఐ‌టిఐఆర్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు అవి సాధ్యం కాదని చెపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను మోసం చేస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో నలుగురు బిజెపి ఎంపీలున్నారని కానీ వారు మతంపేరుతో రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రం కోసం ఏమి చేయగలిగారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. కనుక ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపించడం ద్వారా బిజెపికి తగినవిదంగా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

టిఆర్ఎస్‌ చేస్తున్న ఈ వాదనలకు రాష్ట్ర బిజెపి నేతలు జవాబు చెప్పలేకపోతుండటమే బిజెపిపై టిఆర్ఎస్‌ పైచేయి సాధించిందని స్పష్టం చేస్తోంది. 


Related Post