బిజెపి ఒత్తిడితోనే శశికళ నిష్క్రమణ?

March 04, 2021


img

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించి చెన్నై తిరిగివచ్చిన శశికళ అధికార అన్నాడీఎంకె పార్టీని చీల్చి పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనే ఉద్దేశ్యం ఉన్నట్లే వ్యవహరించారు. త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆమె నేరుగా ఎన్నికలలో పోటీ చేయలేనప్పటికీ అన్నాడీఎంకె పార్టీ పగ్గాలు చేపట్టగలిగితే పరోక్షంగా రాష్ట్రాన్ని పాలించాలని భావించారు. కానీ అన్నాడీఎంకె నేతలు ఎవరూ ఆమెవైపు వెళ్లకుండా సిఎం పళనిస్వామి గట్టిగా కట్టడి చేయడంతో ఆమె ఒంటరిగా మిగిలిపోయారు. 

అయితే ఆమె వలన అన్నాడీఎంకె పార్టీ ఓట్లు చీలిపోయి ప్రతిపక్ష డీఎంకె పార్టీ లబ్దిపొందుతుందని భావించిన బిజెపి, ఆమెతో రాజీపడాలని సిఎం పళనిస్వామి, అన్నాడీఎంకె నేతలపై ఒత్తిడి చేసింది. కానీ ఆమెతో రాజీపడితే మళ్ళీ ఆమె తమ భుజాలపై ఎక్కి సవారీ చేస్తారనే భయంతో వారు అందుకు అంగీకరించలేదు. 

దాంతో మిత్రపక్షంగా ఉన్న బిజెపికి 60 సీట్లు ఇవ్వాలని, వాటిలో 50 సీట్లు ఆమెకు అప్పగిస్తామని బిజెపి చేసిన మరో ప్రతిపాదనను కూడా అన్నాడీఎంకె నిర్ద్వందంగా తిరస్కరించింది. దాంతో శశికళతో చేతులు కలపాలనే బిజెపి ఆలోచనలు విఫలమయ్యాయి. 

అయితే తమిళనాడు రాష్ట్రంలో బిజెపి ఒంటరిగా మనుగడ సాగించలేదు కనుక అన్నాడీఎంకెతో లేదా శశికళతో కలిసి ముందుకు సాగవలసి ఉంటుంది. ఈ పరిస్థితులలో అవినీతిపరురాలిగా ముద్రపడిన శశికళతో అంటకాగితే బిజెపి కూడా ఆ మరక అంటుకొంటుంది. కనుక మళ్ళీ అన్నాడీఎంకెతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకొని ఉండవచ్చు. 

అయితే అన్నాడీఎంకె రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు శశికళ అవరోదంగా ఉన్నట్లు భావిస్తున్న బిజెపి బహుశః ఆమెపై ఒత్తిడి తెచ్చి రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటింపజేసి ఉండవచ్చు. అందుకే శశికళ బుదవారం రాత్రి హటాత్తుగా ‘అన్నాడీఎంకె పార్టీ కోసం త్యాగం చేస్తున్నానంటూ...’ ప్రకటన చేశారని భావించవచ్చు.


Related Post