లాయర్ దంపతుల హత్య కేసుతో టిఆర్ఎస్‌కు ఇబ్బందులు

February 26, 2021


img

మంథనిలో హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా పేర్కొనబడిన టిఆర్ఎస్‌ నేత కుంట శ్రీనును పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ, ఈ వ్యవహారం టిఆర్ఎస్‌ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ఈ కేసు దర్యాప్తుకు సంబందించి పూర్తి నివేదికను సమర్పించవలసిందిగా కోరుతూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ వ్రాశారు. ఈ జంట హత్యల కేసును హైకోర్టు కూడా తీవ్రంగా పరిగణించి సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా ఈ జంట హత్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాయి. 

తాజాగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతలు ఇవాళ్ళ రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ తమిళిసైని కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ కేసులో పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ దీనిలో టిఆర్ఎస్‌ నేతల ప్రమేయం ఉన్నందున పోలీసులు ఆలస్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసుపై లోతుగా దర్యాప్తు జరిపించి దోషులందరినీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

ఎమ్మెల్సీ, మునిసిపల్, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగబోతున్న ఈ సమయంలో ఈ జంటహత్యల కేసులో ఈవిదంగా అన్నివైపుల నుంచి ఒత్తిళ్ళు వస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది.


Related Post