ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ బుదవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తమ లోటస్‌పాండ్ నివాసంలో ఇంటర్, డిగ్రీ విద్యార్ధినులతో ఇష్టాగోష్టి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు షర్మిళ తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు.
“ఆంధ్రాకు చెందిన మీరు తెలంగాణలో రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాలనుకొంటున్నారు?” అనే ప్రశ్నకు సమాధానంగా, “సిఎం కేసీఆర్, విజయశాంతి ఎక్కడివారు?తమిళనాడును పరిపాలించిన స్వర్గీయ జయలలిత ఆ రాష్ట్రానికి చెందినవారు కారు కదా? కానీ నాకు తెలంగాణతో విడదీయరాని బందం ఉంది. నేను ఇక్కడే పుట్టాను...ఇక్కడే పెరిగాను...నాపిల్లలు కూడా ఇక్కడే పుట్టారు. నేను తెలంగాణ కోడలిని. కనుక ఈవిషయంలో ఎవరూ నన్ను ప్రశ్నించలేరు,” అని అన్నారు.
“సిఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పుడు మీరు పార్టీ పెట్టవలసిన అవసరం ఏమిటి?” అనే ప్రశ్నకు “రాష్ట్రంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక మెరుగైన సమాజం నిర్మించేందుకు బాధ్యతగా నేను మీ ముందుకు వస్తున్నాను తప్ప నాకు దీనిలో వేరే ఉద్దేశ్యం లేదు,” అని సమాధానం చెప్పారు.
“మీ అన్న జగన్ మీకు మంత్రి పదవి ఇవ్వలేదు కనుకనే ఇందుకు పూనుకొన్నారా?” అనే ప్రశ్నకు సమాధానంగా, “నాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో ఆయననే అడగండి. ఆయనతో నాకు కుటుంబపరంగా ఎటువంటి విభేధాలు లేవు. రాజకీయ పార్టీ పెట్టాలనే నా ఈ ఆలోచనకు మా తల్లి విజయమ్మగారి మద్దతు కూడా ఉంది,” అని చెప్పారు.
త్వరలోనే పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని షర్మిళ చెప్పారు. అయితే ఆ పాదయాత్ర రోటీన్‌గా ఉండదని అమరవీరులను స్మరించుకొంటూ గడపగడపకు వెళ్ళి అందరి మద్దతు కోరుతానని షర్మిళ చెప్పారు. తెలంగాణలో మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపిస్తేనే ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని షర్మిళ అన్నారు.