అది స్వర్గీయ పీవీని అవమానించడమే: రేవంత్‌

February 23, 2021


img

మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి తప్పు పట్టారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న  కాంగ్రెస్‌ అభ్యర్ధి  చిన్నారెడ్డి తరపున రేవంత్‌ రెడ్డి నిన్న నాలుగో సెట్ నామినేషన్ ఎన్నికల అధికారికి అందజేసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌కు నిజంగా స్వర్గీయ పీవీ నరసింహారావుపై గౌరవాభిమానాలు ఉన్నట్లయితే ఆయన కుమార్తె వాణీదేవికి నామినేటడ్‌ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలి లేదా రాజ్యసభ సీటు ఇవ్వాలి. సిఎం కేసీఆర్‌ తన కుమార్తె కల్వకుంట్ల కవితను ఎమ్మెల్సీగా చేసేందుకు ఎటువంటి విధానం అనుసరించారో వాణీదేవిని కూడా అదేవిదంగా గెలిపించుకొని ఉంటే గౌరవంగా ఉండేది. కానీ ఈ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని గ్రహించిన సిఎం కేసీఆర్‌, స్వర్గీయ పీవీ నరసింహారావు పట్ల అభిమానం చాటుకొంటున్నట్లు వాణీదేవికి టికెట్ కేటాయించారు. ఇది స్వర్గీయ పీవీని, ఆయన కుమార్తె వాణీదేవిని మోసగించడం అవమానించడమే. 

ఒకవేళ ఈ స్థానం నుంచి టిఆర్ఎస్‌ అభ్యర్ధి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం సిఎం కేసీఆర్‌కు ఉన్నట్లయితే, తన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని సవాల్ విసురుతున్నాను. టిఆర్ఎస్‌ గెలిస్తే తన ఖాతాలో వేసుకొనే అలవాటున్న సిఎం కేసీఆర్‌, ఈ ఓటమిని తెలివిగా పీవీ కుటుంబ ఖాతాలో వేసి బయటపడాలనుకొంటున్నారు. సిఎం కేసీఆర్‌కు స్వర్గీయ పీవీ, ఆయన కుటుంబం  పట్ల ప్రేమాభిమానాలతో ఆమెకు ఈసీటు కేటాయించలేదు. తన పార్టీ ఓటమికి వారిని బాధ్యులుచేయాలని ఈవిదంగా చేశారు. ఇది స్వర్గీయ పీవీ, ఆయన కుటుంబాన్ని అవమానించడమే అవుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్ధులు విజయం సాధించడం తధ్యం,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు. 


Related Post