నేడు బిజెపిలో చేరనున్న సిర్పూర్ కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జ్

February 23, 2021


img

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌  కాంగ్రెస్‌ ఇన్‌-ఛార్జ్ పాల్వాయి హరీష్ బాబు, ఆయన అనుచరులు బిజెపిలో చేరనున్నారు. ఇందుకోసం నేడు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో ఛత్రపతి శివాజీ సంకల్పసభ పేరుతో ఓ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, రాష్ట్ర బిజెపి వ్యవహారాల ఇన్‌-ఛార్జ్ తరుణ్ చుగ్ ఆ సభలో పాల్గొని హరీష్ బాబు, ఆయన అనుచరులను బిజెపిలో చేర్చుకోనున్నారు. 

రాష్ట్రంలో ఏ పార్టీ బలపడాలనుకొన్నా ముందుగా కాంగ్రెస్ పార్టీ మీదే దృష్టి పడుతుంది. తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ‘బంగారి తెలంగాణ కోసం రాజకీయ పునరేకీకరణ’ అనే అందమైన పేరుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను ఫిరాయింపజేసుకొని రాష్ట్రంలో టిఆర్ఎస్‌ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని తాపత్రయపడుతున్న బిజెపి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపైనే కన్నేసింది. తెలంగాణలో ‘రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ’ వచ్చిన వైఎస్ షర్మిళ కూడా కాంగ్రెస్‌ పార్టీ మీదే కన్నేస్తున్నారు. అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీని, దాని పాలనను విమర్శిస్తూనే అదే పార్టీ నుంచి నేతలను తెచ్చుకొంటూ తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవాలనుకోవడం విడ్డూరమే కదా?


Related Post