ఈ వయసులో రాజకీయాలు... సిఎం అవ్వాలనే కోరిక!

February 20, 2021


img

భారత్‌లో మెట్రో రైళ్ళకు బాటలుపరిచిన ఈ శ్రీధరన్ మెట్రోమ్యాన్‌గా పేరు పొందారు. ఆ రంగంలో ఆయనకున్న అపార అనుభవం, జ్ఞానం, వెలకట్టలేనివి. ఆయన వయసు ఇప్పుడు 88 ఏళ్ళు. ఈ వయసులో ఆయన రాజకీయాలలోకి ప్రవేశించడానికి సిద్దం అవుతున్నారు. కేరళకు చెందిన ఆయన ఆ రాష్ట్ర బిజెపిలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు... బిజెపి అధిష్టానం ఆదేశిస్తే త్వరలో జరుగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తానని, అవకాశం కల్పిస్తే కేరళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కూడా సిద్దమని శ్రీధరన్ ప్రకటించారు. ఒకవేళ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చి తాను ముఖ్యమంత్రినైతే రాష్ట్రంలో మౌలికవసతులను అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో దశాబ్ధాలుగా కాంగ్రెస్‌, వామపక్ష కూటమి మద్యే అధికార మార్పిడి జరుగుతోందని, ఆ రెండు కూటములకి రాష్ట్రాభివృద్ధి పట్ల సరైన అవగాహన లేదని కనుక రాష్ట్రాభివృద్ధి కోసం ఈసారి బిజెపిని గెలిపించాల్సిన అవసరం ఉందని శ్రీధరన్ అన్నారు.   

 ఆయన బిజెపిలో చేరబోతున్నందున ఆ పార్టీ హిందుత్వ సిద్ధాంతానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు కూడా. కేరళలో వివాదాస్పదంగా మారిన హిందూ, ముస్లిం, క్రీస్టియన్ యువత ‘లవ్ జిహాద్’ పై ఆయన బిజెపి కోణంలో నుంచి మాట్లాడారు. “ఈ లవ్ జిహాద్ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మతమార్పిడిలు జరుగుతున్నాయి. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను,” అని అన్నారు. 

రాజకీయాల నుంచి తప్పుకోవలసిన వయసులో శ్రీధరన్ రాజకీయాలలో ప్రవేశించాలనుకోవడం ఆశ్చర్యకరమే. ఆయన వంటి మేధావి మతప్రాతిపదికన మాట్లాడుతుండటం ఇంకా ఆశ్చర్యకరం. ఈ వయసులో రాజకీయ ప్రవేశం చేసి కేరళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆయన మరింత పేరు ప్రతిష్టలు సంపాదించుకొంటారో... లేదా రాజకీయబురద అంటించుకొని తన పేరు ప్రతిష్టలను, గౌరవాన్ని చేజేతులా నాశనం చేసుకొంటారో కాలమే నిర్ణయిస్తుంది.


Related Post