ఎమ్మెల్సీ ఎన్నికలతో టిజేఎస్‌లో విభేధాలు

February 20, 2021


img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మిత్రుడైన ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీ చేస్తున్నందున అక్కడ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టకుండా ఆయనకు మద్దతు ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం భావించారు. పార్టీ నేతలు కూడా అందుకు సమ్మతించారు. కానీ పార్టీ ఉపాధ్యక్షుడు రమేశ్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేయడంతో పార్టీలో విభేధాలు బయటపడ్డాయి. ఆయన పోటీ చేయడానికి పార్టీ అనుమతి లేదని కనుక ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వబోమని తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు చెప్పారు.

కాంగ్రెస్‌, వామపక్షాలు బలపరిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు మద్దతు ఇస్తున్నప్పుడు, ఆ రెండు పార్టీలు వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తమ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు ఎందుకు మద్దతు ఇవ్వడంలేదని రమేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తమ అధ్యక్షుడు మద్దతు కోరుతూ వారికి లేఖ వ్రాసినా పట్టించుకోకుండా తమ అభ్యర్ధులను నిలబెడుతున్నపుడు మనం మాత్రం వారి కోసం ఎందుకు త్యాగం చేయాలని రమేష్ రెడ్డి వాదన. కానీ ఆయనకు నచ్చజెప్పి నామినేషన్ ఉపసంహరించుకొనేలా చేస్తామని తెలంగాణ జనసమితి పార్టీ ప్రతినిధి చెప్పారు.


Related Post