టిఆర్ఎస్‌ పాట మారింది!

February 19, 2021


img

నెలరోజుల క్రితం వరకు టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలు అందరూ ‘త్వరలోనే కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ’ పదేపదే పాటపాడారు. అయితే సిఎం కేసీఆర్‌ వారందరికీ గట్టిగా వార్నింగ్ ఇవ్వడమే కాక ‘మరో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ’ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో టిఆర్ఎస్‌ నేతలు ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. 

మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలో టిఆర్ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మరో 20 ఏళ్ళ వరకు కేసీఆరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తోంది. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు లభిస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజాప్రతినిధుల జీతాభత్యాలలో కోత విధించి రైతులకు రైతు బంధు, రైతు భీమా పధకాలను కొనసాగించారు. రాష్ట్రంలో ప్రతీ ఇంట్లో సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పధకాలతో లబ్ధిపొందినవారున్నారు. కనుక మరో 20 ఏళ్ళు కేసీఆరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది,” అని అన్నారు. 

ఓ టిఆర్ఎస్‌ నేతగా, టిఆర్ఎస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఆమె ఆవిదంగా కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఓ వ్యక్తి అధికారంలో చిరకాలం కొనసాగడానికి మనది రాజరిక వ్యవస్థకాదు...ప్రజాస్వామ్యవ్యవస్థ. ప్రతీ 5 ఏళ్ళకు వచ్చే ఎన్నికలలో పాల్గొని ప్రజామోదం పొందిన పార్టీయే అధికారంలోకి వస్తుంటుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకొన్న శాసనసభాపక్షనేత ముఖ్యమంత్రి అవుతారని అందరికీ తెలుసు. కనుక రాబోయే 20 ఏళ్ళలో జరిగే ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిచి అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడాన్ని ఎవరూ అభ్యంతరం చెప్పలేరు..అడ్డుకోలేరు. టిఆర్ఎస్‌ నేతలకు ఆ నమ్మకం ఉన్నందునే ఈవిధంగా మాట్లాడుతున్నారని సరిపెట్టుకోవలసి ఉంటుంది. 

అయితే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల గెలుపుతో సమరోత్సాహంతో ఉన్న బిజెపి త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కూడా గెలిచి తన సత్తా చాటుకొని వచ్చే శాసనసభ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలో వస్తామని గట్టిగా వాదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కనుక ఈ నేపధ్యంలో ‘చిరకాలం మేమే అధికారంలో ఉంటామనుకోవడం’ అత్యాశే అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగాదెబ్బ తీసినట్లే బిజెపిని కూడా దెబ్బతీసి దానికి కూడా టిఆర్ఎస్‌ ముక్కుతాడు వేసి నియంత్రించగలిగితే అప్పుడు ఇటువంటి ఆలోచనలు చేసుకోవచ్చు. కానీ దూసుకువస్తున్న బిజెపిని కత్తిరించడం సాధ్యమేనా? టిఆర్ఎస్‌ ఆలోచించుకోవాలి. 


Related Post