షర్మిళ ఎవరు వదిలిన బాణం?

February 18, 2021


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిళ హటాత్తుగా తెలంగాణ రాష్ట్రంలో ‘రాజన్న రాజ్యం స్థాపిస్థానంటూ’ హైదరాబాద్‌లో దిగడంతో రాష్ట్ర రాజకీయాలలో కలకలం మొదలైంది. 

నీళ్ళ పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ ప్రభుత్వంపైకి జగనన్న వదిలిన బాణమే షర్మిళ అని కొందరు, రాష్ట్రంలో రెడ్డి, క్రీస్టియన్ సామాజిక వర్గాలను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంచేసి పార్టీని మరింత దెబ్బతీయడానికి టిఆర్ఎస్‌, బిజెపిలు  సంధించిన బాణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి వంటి నేతలు వాదిస్తున్నారు. 

తెలంగాణలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న బిజెపిని అడ్డుకొనేందుకు ఆంద్రా పాలకులనే బూచిని చూపించడానికి టిఆర్ఎస్‌ దింపిన బాణమే షర్మిళ అని బిజెపి నేతలు వాదిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ళలోనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిపధంలో దూసుకుపోతుండటంతో ఓర్వలేక ఆంద్రాపాలకులు తెలంగాణపైకి సంధించిన బాణమే షర్మిళ అని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. ఈవిధంగా ఒక్కో పార్టీ షర్మిళ తెలంగాణ రాజకీయాలలో ప్రవేశాన్ని ఒక్కో కోణంలో నుంచి చూపిస్తూ వాదిస్తున్నాయి. 

అయితే ‘నేను ఎవరూ వదిలిన బాణాన్ని కాను. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించాలనే ఆలోచనతోనే వచ్చానని షర్మిళ చెపుతున్నారు. ‘ఆంద్రాకు చెందిన షర్మిళకు తెలంగాణ రాష్ట్రంలో ఏంపని?’ అని ప్రశ్నిస్తున్న తెలంగాణ పార్టీలకు ఆమె తనదైన శైలిలో సమాధానం చెప్పారు. “నాకు ఆంద్రా పుట్టినిల్లు కాగా తెలంగాణ రాష్ట్రం మెట్టినిల్లు. కనుక తెలంగాణ కోడలుగా రాష్ట్రంలో పార్టీ స్థాపించుకొని రాజకీయాలలో పాల్గొనే హక్కు, అధికారం నాకున్నాయి,” అని షర్మిళ చెపుతున్నారు. 

అయితే ఆమె రాకతో రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ పెరిగితే దాంతో టిఆర్ఎస్‌ మాత్రమే పూర్తిగా లాభపడుతుంది. షర్మిళ రాకతో కాంగ్రెస్‌, బిజెపిలు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక షర్మిళ రాకపై కాంగ్రెస్‌ భయాలు, వాదనలు అర్దవంతమైనవనే భావించవచ్చు. కనుక బిజెపి, ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తపడటం మంచిది.


Related Post