తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగలదా?

January 18, 2021


img

ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్‌ పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేసీఆర్‌ కబంద హస్తాలలో చిక్కుకుపోయిన తెలంగాణను విడిపించి, రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేద్దాం. ప్రగతి భవన్‌ అవినీతి పనులకు అడ్డాగా మారిపోయింది. తెలంగాణ వస్తే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్‌ చెప్పారు. కానీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించాలో చెప్పాలని సిఎం కేసీఆర్‌ను సవాలు చేస్తున్నాను. ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎండగడదాం. నిరంకుశ రాక్షసపాలన చేస్తున్న సిఎం కేసీఆర్‌ను గద్దె దించి గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేసేందుకు రాష్ట్రంలోని హిందువులందరినీ ఏకం చేస్తూ ముందుకు సాగుదాం,” అని అన్నారు. 

రాష్ట్రంలో బిజెపి కాస్త బలపడిన మాట వాస్తవం. శక్తివంతమైన టిఆర్ఎస్‌ను ఏవిధంగా ఢీకొనాలో బాగానే గ్రహించింది. రెండు వరుస విజయాలతో రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలలో బిజెపి పట్ల నమ్మకం కలిగేలా చేసి మతతత్వపార్టీగా ముద్రపడిన బిజెపిలోకి చేరేలా చేసుకోగలుగుతోంది. టిఆర్ఎస్‌కు బిజెపి ప్రత్యామ్నాయమనే భావన ప్రజలలో కూడా కలిగించగలుగుతోంది. అయితే ఒకటి రెండు ఎన్నికలలో టిఆర్ఎస్‌ తడబడినా ఎప్పటికీ అలాగే తడబడుతుందనుకోలేము. 

టిఆర్ఎస్‌లో సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి, తలసాని, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ వంటి హేమాహేమీలు అనేకమంది ఉన్నారు. అలాగే కవిత, బాల్క సుమన్, కర్నె ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ వంటి ఫైర్ బ్రాండ్ నేతలున్నారు. సిఎం కేసీఆర్‌ ఎన్నికల వ్యూహాల ముందు ఎంతటివారైనా చతికిలపడాల్సిందేనని పలు ఎన్నికలలో నిరూపితమైంది. 

కానీ బిజెపిలో వారిని ధీటుగా ఎదుర్కోగలిగిన బలమైన నేతలు వేళ్ళపై లెక్కించవచ్చు. ఎన్నికలొస్తే అభ్యర్ధులను వెతుక్కోవలసిన దుస్థితి. కేసీఆర్‌-మోడీ దోస్తీ బిజెపి విశ్వసనీయతకు ఎప్పుడూ ప్రశ్నార్దకంగానే ఉంటోంది. కనుక త్వరలో జరుగబోయే ఎన్నికలలో బిజెపి మళ్ళీ సత్తా చాటుకొని రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో మరింత బలపడితేకానీ బిజెపి భవిష్యత్‌ను అంచనా వేయలేము.


Related Post