కరోనా పరీక్షలో భారత్‌ గెలిచింది: ప్రధాని మోడీ

January 16, 2021


img

దేశవ్యాప్తంగా నేటి నుండి కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ ఈ సందర్భంగా దేశప్రజలను ఉద్దేశ్యించి చాలా ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ … అంటూ మహాకవి గురజాడ వ్రాసిన తెలుగు పద్యాన్ని చదివారు.  

“గత ఏడాది దేశంలో కరోనా ప్రవేశించినప్పటికి మనకు దాని గురించి అవగాహన లేదు. దానిని ఏవిధంగా ఎదుర్కోవాలో తెలీదు. కరోనా పరీక్షలు చేయడానికి తగినన్ని వైద్య పరీక్షా కేంద్రాలు లేవు. కనీసం మాస్కూలు, పీపీఈ కిట్లు కూడా లేని పరిస్థితి నుండి ఇప్పుడు యావత్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయగల స్థాయికి ఎదిగాము. అయితే గత ఏడాది మొత్తం యావత్ దేశ ప్రజలు కరోనాతో తల్లడిల్లిపోవడం గుర్తుకొస్తే నేటికీ చాలా బాధ కలుగుతోంది. కరోనా మహమ్మారికి అనేకమంది బలైపోయారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా కట్టడికి అలుపెరుగని పోరాటం చేశారు. వారిలో అనేకమంది చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన మనసులను కలచివేసే పోరాటం. అయినప్పటికీ వారి పోరాటాలు... బలిదానాల ఫలితంగా భారత్‌ కరోనాను జయించింది. యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందిప్పుడు. దేశంలో 135 కోట్ల భారతీయులు ఒక్క త్రాటిపైకొచ్చి పోరాడటం వలననే ఇది సాధ్యమైంది. లాక్‌డౌన్‌ విధింపు వలన సామాన్య ప్రజలు, వలసకార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారని తెలుసు. కానీ అప్పుడు అటువంటి కటినమైన నిర్ణయం తీసుకోవడం వలననే భారత్‌ నేడు కరోనా నుంచి బయటపడగలుగుతోంది. మనమే స్వయంగా కరోనా వ్యాక్సిన్‌లను తయారుచేసుకొని దానిని పూర్తిగా నిర్మూలించడానికి నేడు మొదటి అడుగు వేస్తున్నాము. కరోనాపై మన పోరాటాన్ని, విజయాన్ని, మన వ్యాక్సిన్‌లను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయి. మన వ్యాక్సిన్ల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇది మన అందరికీ గర్వకారణం. అయితే వ్యాక్సిన్‌ వేసుకొన్నామని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో కరోనా పూర్తిగా తొలగిపోయే వరకు అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగ సారాంశం.  



Related Post