ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు?

January 15, 2021


img

త్వరలో జరుగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్ధులను ఖరారు చేసినట్లు తాజా సమాచారం. రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ జిల్లాల నియోజకవర్గానికి మాజీ మంత్రి జి. చిన్నారెడ్డిని, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ జిల్లాల నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్సీ ఎస్‌. రాములు నాయక్‌ల పేర్లను దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. 

ఇదివరకు రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయినా కనీసం రెండో స్థానంలో ఉండేది కానీ దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. కనుక ఇకపై జరుగబోయే ప్రతీ ఎన్నికలను సవాలుగా తీసుకొని  బలమైన అభ్యర్ధులను నిలబెట్టాలని కాంగ్రెస్‌ అధిష్టానం సూచన మేరకు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లు చొప్పున మొత్తం ఆరుగురి పేర్లను ఎంపిక చేసి పంపించారు. వారిలో ఓయూ విద్యార్ధి నాయకుడు కొటూరి మానవతారాయ్, వంశీచంద్ రెడ్డి పేర్లు కూడా ఉన్నప్పటికీ రాజకీయ అనుభవం, కులసమీకరణాలు, ఆర్ధికస్థోమత వగైరా అంశాలను పరిగణనలోకి తీసుకొని వారిరువురి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రెండుమూడు రోజులలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Related Post