ఆ అంశంపై రాజకీయాలు చేసి తప్పించుకోగలరా?

January 08, 2021


img

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలలో దేవతా విగ్రహాల విధ్వంసంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి, బిజెపిల మద్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరుసగా ఆలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు  పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు వాదిస్తుంటే, తమ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలుచేసేందుకు టిడిపియే ఈ దాడులు చేయిస్తూ నీచ రాజకీయాలు చేస్తోందని అధికార వైసీపీ వాదింస్తోంది. సున్నితమైన ఈ వ్యవహారంపై  రెండు పార్టీలు తమ వాదనలతో ప్రత్యర్ధి పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నాయి. 

వైసీపీ ప్రభుత్వం చేతిలో అధికారంలో ఉన్నప్పటికీ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు వరుసగా జరుగుతున్నప్పుడు వాటిని ఎందుకు అడ్డుకోలేకపోతోంది? పోలీసులు దోషులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్న ఈ ఘటనల వెనుక ఎవరున్నారు?అసలు ఇటువంటి అకృత్యాలు ఎందుకు చేస్తున్నారు? అనే ప్రజల ప్రశ్నలకు అధికార, ప్రతిపక్షాల వాదనలు జవాబులు కావని అందరికీ తెలుసు. 

కానీ ఆ రెండు పార్టీలు సున్నితమైన ఈ సమస్యను పరిష్కరించకుండా తమతమ వాదనలతో ప్రత్యర్ధి పార్టీని దెబ్బ తీసి తప్పించుకోవాలనుకొంటున్నాయే తప్ప వాటితో కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నామని గ్రహించినట్లు లేదు. 

ఏపీలో ఇప్పటివరకు బిజెపికి పెద్దగా బలం లేదు కానీ హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న ఈ దాడులతో బిజెపికి అవకాశం కల్పించినట్లయింది. టిడిపి, వైసీపీల వైఖరితో విసిగిపోయున్న ఏపీ ప్రజలు ఆ రెంటికీ ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్న బిజెపివైపు మొగ్గు చూపడం ఖాయం. అదే జరిగితే టిడిపి, వైసీపీలకు మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం. కనుక ఇకనైనా వాటి ధోరణి మార్చుకోకపోతే ఆ రెండు పార్టీలే తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోవలసిరావచ్చు.


Related Post