పార్టీలకు లేదు సరే...మరి కృష్ణయ్యకు చిత్తశుద్ది ఉందా?

January 08, 2021


img

అన్ని రాజకీయపార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. హైదరాబాద్‌ మింట్ కాంపౌండ్ వద్ద మంగళవారం బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలో మాట్లాడుతూ, “రాజకీయ పార్టీలకు ఎన్నికలప్పుడే బీసీలు...వారి సంక్షేమం గుర్తొస్తుంటుంది. అన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి తప్ప వారి సంక్షేమం పట్ల ఎవరికీ చిత్తశుద్ది లేదు. బీసీలు తమ హక్కులు, అధికారం కోసం నిత్యం చేతులే చాచేలా చేస్తూ అన్ని పార్టీలు బీసీలను బిచ్చగాళ్ళుగా మార్చేశాయి. ఇప్పటికైనా రాజకీయ పార్టీల తీరు మార్చుకొని బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచిత స్థానం కల్పించాలి,” అని అన్నారు. 

బీసీల సంక్షేమం కోసం, వారి హక్కుల కోసం ఆర్‌.కృష్ణయ్య చాలా ఏళ్ళుగా పోరాడుతున్న మాట వాస్తవం. అయితే ఎప్పుడైతే ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో టిడిపి తరపున పోటీ చేసి గెలిచారో అప్పటి నుంచి ఆయనకు కూడా పదవి, అధికారంపై యావ పెరిగినట్లే కనిపిస్తోంది. నిజానికి బీసీ నాయకుడిగా ఆయనకున్న పరపతిని వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆనాడు చంద్రబాబునాయుడు ఆయనను ఎన్నికలకు ముందు టిడిపిలోకి ఆహ్వానించి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దింపారని అందరికీ తెలుసు. అటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరూ కాదనుకోలేరు కనుక అందుకు కృష్ణయ్యను తప్పు పట్టలేము. కానీ రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని ఆరోపిస్తున్న కృష్ణయ్య కూడా మరి అదే చేశారు కదా? బీసీల సమైక్యశక్తిని ఆయన కూడా వాడుకొన్నట్లు చెప్పవచ్చు.

బీసీల నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన రాజకీయంగా కూడా ఎదగాలని గట్టిగానే ప్రయత్నించారు. దానినీ తప్పుపట్టలేము. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నాలుగున్నరేళ్ళలో బీసీల కోసం ఏమి చేశారో తెలీదు కానీ 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికల వరకు ఆయన రాజకీయ ఆరాటాన్ని అందరూ చూశారు. కానీ రాజకీయ అనుభవం, లౌక్యం లేకపోవడం వలన ఆయన రాజకీయాలలో రాణించలేకపోయారు. దాంతో ఆయన మళ్ళీ బీసీ నాయకుడిగా ఇప్పుడు వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారనుకోవచ్చు. వారి సంక్షేమం, అభివృద్ధి పట్ల ఆయనకే చిత్తశుద్ది లేనప్పుడు ఇక ‘అధికారమే మా లక్ష్యం’ అని కుండబద్దలు కొట్టినట్లు చెపుతున్న రాజకీయపార్టీలకు ఎందుకు ఉంటుంది?బీసీలకు హక్కులు, రాజ్యాధికారం కావాలనుకొంటే వారి సమైక్య శక్తిని ఓ ఆయుధంగా చేసుకొని చిత్తశుద్దితో పోరాడవలసి ఉంటుంది లేకుంటే బీసీలు ఎప్పటికీ ఓటు బ్యాంకుగానే మిగిలిపోతారు. 


Related Post