తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాకూర్ నిన్న అధికారిక ప్రకటన చేశారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాగార్జునసాగర్ ఉపఎన్నికల వరకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఆ ఎన్నికలు చాలా కీలకమైనవిగా భావిస్తున్నాము. ఎన్నికలకు ముందు కొత్త అధ్యక్షుడుని నియమిస్తే ఆయన కుదురుకోవడానికి కొంత సమయం పడుతుంది కనుక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే కొత్త అధ్యక్షుడుని నియమించాలని సీనియర్ నేత కె.జానారెడ్డి సూచించారు. ఆయన సూచనపై పార్టీలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక సాగర్ ఉపఎన్నికల తరువాతే పిసిసి అధ్యక్షుడిని నియమించాలని మా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే మా పార్టీ నాగార్జునసాగర్ ఉపఎన్నికలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ అభ్యర్ధిగా కె.జానారెడ్డి పోటీ చేస్తారు. ఆ ఎన్నికల తరువాత పిసిసి అధ్యక్షుడి నియామకంతో పాటు పూర్తి స్థాయి కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేస్తాము. వారి నేతృత్వంలోనే 2023 శాసనసభ ఎన్నికలకు వెళతాము,” అని చెప్పారు.