లాక్‌డౌన్ కష్టకాలంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలే వలస కార్మికులను ఆదుకోలేక చేతులెత్తేసాయి. బడా బడా కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీలు సైతం వారి కష్టాలను తీర్చలేకపోయాయి...వారి కన్నీళ్ళను తుడిచి కాస్తంత ఓదార్పు ఇవ్వలేకపోయాయి. అటువంటి దయనీయమైన పరిస్థితులలో వలస కార్మికులకు నేనున్నానంటూ ముందుకు వచ్చారు ప్రముఖ టాలీవుడ్, బాలీవుడ్ హీరో సోనుసూద్.
ఒక్క వలస కార్మికులకే కాదు దేశంలో నిరుపేదలు, నిసహాయులు, అభాగ్యులు ఎవరికి ఏ కష్టం వచ్చినా చిన్న లెటర్ లేదా చిన్న ఫోన్ మెసేజ్ పెడితే చాలు... అలనాడు గజేంద్రుడిని కాపాడేందుకు తరలివచ్చిన శ్రీమహావిష్ణువులా వెంటనే వారిని ఆదుకొన్నాడు. దేశంలోనే కాదు విదేశాలలో చిక్కుకుపోయినవారిని కూడా సొంత డబ్బుతో విమానాలు పంపించి ఇళ్ళకు చేర్చాడు.
వారిని సొంత ఇళ్ళకు చేర్చడంతో తన పని అయిపోయిందనుకోకుండా వారికి ఉపాది అవకాశాలు కల్పిస్తున్నాడు. నిరుపేద విద్యార్ధులకు పుస్తకాలు అందిస్తున్నాడు. వారిలో ప్రతిభావంతులైన విద్యార్ధులకు స్కాలర్ షిప్పులు ఇస్తున్నాడు. 18 ఏళ్ళు లోపు వయసున్న పిల్లలు గుండె సంబందిత సమస్యలతో బాధపడుతుంటే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. ఇలా చెప్పుకొంటూపోతే సోనూసూద్ చేస్తున్న సమాజాసేవకు అంతేలేదు.
అటువంటి వ్యక్తిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఎందుకంటే ముంబైలో సోనుసూద్ తన నివాస గృహాన్ని హోటల్‌గా మార్చి దానిలో కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులకు, నర్సులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
బీఎంసీ అనుమతి లేకుండానే సోనూసూద్ తన నివాసాన్ని హోటల్‌గా మార్చారని వారి ఆరోపణ. తాము ఈ విషయమై పలుమార్లు నోటీసులు పంపినా కూడా సోనూసూద్ స్పందించలేదని, కనుకనే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వారు చెప్పారు. బృహున్ ముంబై అని చాలా గొప్పగా పేరు పెట్టుకోగలిగింది కానీ కార్మికులకు కష్టకాలంలో సాయం చేయలేక చేతులు ఎత్తేసింది. వారికి సాయం చేసిన పాపానికి సోనూసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.