అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ ఏదో ఓ అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. జో బైడెన్ ప్రమాణస్వీకారం తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ ఇంకా రెచ్చిపోతున్నారు. వాషింగ్‌టన్‌లో క్యాపిటల్ హిల్‌లో బుదవారం కాంగ్రెస్ సమావేశం జరుగుతుండగా ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా దానిలోకి జొరబడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఘర్షణలలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. నగరంలో కర్ఫ్యూ విధించినప్పటికీ ట్రంప్ మద్దతుదారులు వెనక్కు తగ్గకపోవడంతో నగర మేయర్ మురియల్ బౌజర్ 15 రోజులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. నగరంలో అన్నీ ప్రధాన కూడళ్లలో భారీగా భద్రతాదళాలను మోహరించి, ఎవరినీ ఇళ్ళలో నుంచి బయటకు రాకుండా అడ్డుకొంటున్నారు.
అత్యున్నతమైన అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత హుందాగా తప్పుకొని గౌరవం నిలుపుకోవలసి ఉండగా, అధికారం చేజారిపోకుండా కాపాడుకొనేందుకు ఆయనే దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విదంగా వ్యవహరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.