తెలంగాణలో బర్డ్-ఫ్లూ లేదు: తలసాని

January 07, 2021


img

గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారితో దేశంలో ప్రజలు అల్లాడిపోయారు. ఇప్పుడిప్పుడే వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోందనుకొంటే, మళ్ళీ అది కరోనా స్ట్రెయిన్ రూపంలో విదేశాల నుంచి వస్తున్నవారి ద్వారా భారత్‌లోకి ప్రవేశించింది. కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠాలు, దానిని ఎదుర్కొన్న అనుభవంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కరోనా స్ట్రెయి న్‌ను కూడా కట్టడి చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు కొత్తగా దేశంలో బర్డ్-ఫ్లూ వ్యాధి (ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌) వ్యాపిస్తోంది. ఇది కూడా విదేశాల నుంచి వలస వచ్చే పక్షుల ద్వారానే దేశంలోకి ప్రవేశించింది. ఈ వైరస్‌ ప్రధానంగా కాకులు, పౌల్ట్రీ కోళ్ళు, పౌల్ట్రీ బాతులకు సోకుతున్నట్లు గుర్తించిన కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. బర్డ్-ఫ్లూ వైరస్‌తో ఒక్క హర్యానా రాష్ట్రంలోనే 4 లక్షల కోళ్ళు చనిపోయాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో వందల సంఖ్యలో కాకులు చనిపోతున్నాయి. కోళ్ళు, బాతుల ద్వారా మనుషులకు కూడా బర్డ్-ఫ్లూ వ్యాధి సోకే ప్రమాదం ఉండటంతో మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలలో వేల సంఖ్యలో కోళ్ళు, బాతులను చంపుతున్నారు.

బర్డ్-ఫ్లూ వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దేశంలో బర్డ్-ఫ్లూ అనుమానిత కేసులు ఎక్కువగా ఉన్నందున అన్ని రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించిన నేపద్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బర్డ్-ఫ్లూ నివారణ కోసం బుధవారం మాసబ్ ట్యాంక్‌లోని పశు సంక్షేమభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బర్డ్-ఫ్లూ వ్యాప్తికి అవకాశం లేదని అన్నారు.

రాష్ట్రంలో కోళ్లలో ఇప్పటివరకు బర్డ్-ఫ్లూ వైరస్ ఆనవాళ్లు కనబడలేదని అన్నారు. కనుక ప్రజలు, రైతులు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు.


Related Post