త్వరలో రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగనున్నందున ఈ సమయంలో పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక చేస్తే పార్టీ నేతలలో అసంతృప్తి ఏర్పడి పార్టీ నష్టపోతుందని, కనుక నాగార్జునసాగర్ ఉపఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా వేయాలని సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సలహా మేరకు పార్టీ అధిష్టానం ఆఖరి నిమిషంలో పిసిసి అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను నిలిపివేసినట్లు తాజా సమాచారం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడుతున్నప్పటికీ పార్టీ పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించకుండా, పదవుల కోసం మాత్రమే కొందరు నేతలు ఆలోచిస్తుండటం చాలా శోచనీయమే. అయితే జగ్గారెడ్డి, జానారెడ్డి వంటి కొందరు సీనియర్ నేతలు చొరవ తీసుకొని, వాస్తవ పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేయడం చాలా అభినందనీయమే. లేకుంటే వారు హెచ్చరించినట్లుగానే పార్టీలో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయుండేవారు.
ఒకవేళ పిసిసి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసినట్లయితే, ఆ పదవి దక్కని అసంతృప్త నేతలు, వారి అనుచరులు తప్పకుండా పార్టీని వీడివెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతో ఇప్పటికే చాలా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీ, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలు, రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ముందు మరింత బలహీనపడి ఉండేది. కనుక పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను కొన్ని రోజులు వాయిదా వేయడమే మంచిది. అయితే అదే పరిష్కారం కాదు కనుక సాగర్ ఎన్నికలు పూర్తికాగానే మళ్ళీ కాంగ్రెస్‌లో కొట్లాటలు, చీలికలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టబోయే నాయకుడు ఓ పక్క టిఆర్ఎస్, బిజెపిలను ఎదుర్కొంటూనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొంటూ ప్రజల నమ్మకాన్ని పొందవలసి ఉంటుంది. కనుక పిసిసి కొత్త అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాము వంటిదే అని చెప్పవచ్చు.