టి-పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా

January 06, 2021


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక మళ్ళీ వాయిదా పడినట్లు తాజా సమాచారం. త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది కనుక ఇప్పుడు ఎవరిని పిసిసి అధ్యక్షుడిగా నియమించినా అసంతృప్తి చెందిన నేతలు పార్టీని వీడి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని కనుక సాగర్ ఉపఎన్నికలు పూర్తయ్యేవరకు వాయిదా వేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సూచనల మేరకు కాంగ్రెస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.     

సీనియర్ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందంటూ నిన్న ఉదయం నుంచి మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపించాయి. నిన్న జీవన్ రెడ్డి పుట్టినరోజు కూడా కావడంతో కాంగ్రెస్‌ నేతలు ఆయన నివాసానికి చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “అధిష్టానం నాకు ఎటువంటి బాధ్యతలు అప్పగించినా చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాను...” అంటూ చెప్పడంతో ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఖరారు అయిపోయిందనే అందరూ అనుకున్నారు. నిన్న సాయంత్రంలోగా కాంగ్రెస్‌ అధిష్టానం ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని అందరూ ఎదురుచూస్తుంటే, హటాత్తుగా పిసిసి అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేసినట్లు కబురు వచ్చింది. జీవన్ రెడ్డి ఆ పదవి ఆశించనప్పటికీ అనూహ్యంగా తన పేరు ఖరారు అయినట్లు వార్తలు రావడంతో సంతోషిస్తున్న తరుణంలో ఈ వార్త రావడంతో నిరాశ చెంది ఉండవచ్చు. 

పిసిసి అధ్యక్ష పదవి రేసులో రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిలువగా వారిలో రేవంత్‌ రెడ్డివైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ రేవంత్‌ రెడ్డికి ఇస్తే తాము పార్టీ విడిచిపెట్టి వెళ్లిపోతామని సీనియర్లు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని హెచ్చరించడంతో మద్యే మార్గంగా జీవన్‌ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. కానీ పిసిసి అధ్యక్ష పదవి కోసం చివరి వరకు పోరాడిన తనను కాదని జీవన్ రెడ్డికి ఆ పదవిని కట్టబెడతానంటే రేవంత్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పి ఉండవచ్చు. బహుశః దీనికి ఇదీ ఓ కారణం అయ్యుండవచ్చు.  


Related Post