బిజెపిలో చేరిన జీవితా రాజశేఖర్

January 05, 2021


img

తెలంగాణ బిజెపిలోకి ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తల చేరికల పర్వం మళ్ళీ మొదలైంది. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో రంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్లా, నాగార్జునసాగర్, నారాయణఖేడ్ జిల్లాలకు చెందిన పలువురు ద్వితీయశ్రేణి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బిజెపిలో చేరారు. నిన్న బిజెపిలో చేరినవారిలో నటి జీవితా రాజశేఖర్‌, టీపీసీసీ కార్యదర్శి, ప్రముఖ గాయకుడు దరువు ఎల్లన్న కూడా ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వారందరికీ కాషాయకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

జీవితా రాజశేఖర్ దంపతులు ఎప్పుడూ జంటగానే కనబడుతుంటారు. డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో తొలిసారిగా జీవిత ఒక్కరే బిజెపి కార్యాలయానికి వచ్చి బండి సంజయ్‌ సమక్షంలో బిజెపిలో చేరారు. వారిరువురూ సినీ పరిశ్రమలో చాలా ఏళ్ళుగా ఉంటూ మంచి సూపర్ హిట్ సినిమాలు అందించినప్పటికీ కొన్ని కారణాల వలన వెనకబడిపోయారు. ఆ తరువాత వారు రాజకీయాలలో ప్రవేశించి ఎన్ని పార్టీలు మారినా పెద్దగా గుర్తింపు లభించలేదనే చెప్పవచ్చు. మొదట కాంగ్రెస్‌లో చేరిన వారిరువురు ఆ తరువాత టిడిపి, బిజెపి, వైసీపీలో చేరి మళ్ళీ ఇప్పుడు బిజెపికి తిరిగివచ్చారు. కానీ ఇప్పటికే విజయశాంతి కూడా బిజెపిలో చేరారు కనుక జీవితారాజశేఖర్ దంపతులకు ఈసారైనా బిజెపిలో తగిన గుర్తింపు లభిస్తుందో లేదో అనుమానమే.


Related Post