రేవంత్‌ రెడ్డికి జగ్గారెడ్డి చురకలు

January 02, 2021


img

తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నవారిలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా కాస్త వెనక్కు తగ్గారు. కనుక ఒకవేళ తనకు ఆ పదవి దక్కకపోయినా పరువాలేదు కానీ రేవంత్‌ రెడ్డికి మాత్రం ఇవ్వకూడదని జగ్గారెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. అదేవిషయం మరోసారి గట్టిగా నొక్కి చెపుతూ, “ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కావలసింది పులులు సింహాలు కావు... పార్టీలో అందరినీ కలుపుకుపోగల సమర్దుడైన నాయకుడు. త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగనున్నందున అప్పటివరకూ ఉత్తమ్‌కుమార్ రెడ్డినే అధ్యక్షుడిగా కొనసాగించాలని కోరుతూ నేను మా పార్టీ అధిష్టానానికి లేఖ వ్రాశాను. పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక గురించి నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ సలహా ఇచ్చాను తప్ప దీనిలో నా స్వార్ధం ఏమీ లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చాలా ఇబ్బందికరంగా మారింది. దాని వెనుకున్న నేతలు దానిని తక్షణమే నిలిపివేయాలని కోరుకొంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు బలమైన నాయకులను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ ఐదు నియోజకవర్గాలు చొప్పున బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని మా అధిష్టానానికి సూచించాను. అలాగే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకుగాను దేనికి దానికి కమిటీలు వేస్తే బాగుంటుందని సూచించాను,” అని అన్నారు. 

రేవంత్‌ రెడ్డికి మద్దతుగా సోషల్ మీడియాలో ఆయన అభిమానులో...అనుచరులో చాలారోజులుగా ప్రచారం చేస్తున్నారు. వారు రేవంత్‌ రెడ్డిని ‘తెలంగాణ టైగర్’ అని పిలుచుకొంటున్నారు. అందుకే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి పులులు సింహాలు అవసరం లేదని అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడు కావాలని అన్నారు. అంటే రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించబోమని జగ్గారెడ్డి స్పష్టంగానే చెప్పారని అర్ధమవుతోంది.


Related Post