తమిళనాడులో ఎంట్రీకి మజ్లీస్‌కు చక్కటి అవకాశం

January 02, 2021


img

ఇప్పటివరకు హైదరాబాద్‌ పాతబస్తీకే పరిమితమైన మజ్లీస్‌ పార్టీ ఇటీవల బిహార్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 5 సీట్లు గెలుచుకోవడంతో చాలా ఉత్సాహంగా ఉంది. కనుక త్వరలో జరుగబోయే తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో కూడా పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకొంటోంది.

పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా సుమారు 25-30 స్థానాలలోనూ, తమిళనాడులో ఏదో ఓ ప్రధానపార్టీతోనైనా పొత్తులు కుదిరితే కనీసం 15-21 స్థానాలలోనూ పోటీ చేయాలని భావిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకె పార్టీని సంప్రదించగా అటునుండి సానుకూల స్పందన వచ్చింది.

శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకె పార్టీ ‘హృదయాలను కలుపుదాం’ అనే నినాదంతో ఈ నెల 6న పెరుంబూరులో ఓ బహిరంగసభ నిర్వహిస్తోంది. దానికి హాజరుకావలసిందిగా మజ్లీస్‌ పార్టీకి ఆహ్వానం పంపించింది. మజ్లీస్‌కు అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇటీవల చెన్నై వెళ్లినప్పుడు డీఎంకే మైనార్టీ సంక్షేమ విభాగం రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌ ఆయనను కలిసి పెరుంబూరులో జరుగబోయే మహానాడులో పాల్గొనాలని ఆహ్వానించారు. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న అసదుద్దీన్ ఓవైసీ వెంటనే అంగీకరించారు. 

తమిళనాడులో అడుగుపెట్టాలని ఎదురుచూస్తున్న మజ్లీస్‌ పార్టీకి ఈవిధంగా తలుపులు తెరుచుకోవడం చాలా శుభపరిణామమే అని చెప్పవచ్చు. ఎందుకంటే తమిళనాడులో స్థానిక పార్టీల అండదండలు లేకపోతే జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలను కూడా రాష్ట్ర ప్రజలు ఆదరించడం లేదు. కనుక మజ్లీస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఫలితం ఉండేది కాదు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకె పార్టీయే తమిళనాడు తలుపులు తెరిచి ఆహ్వానించడంతో మజ్లీస్‌ పార్టీ ఆ రాష్ట్రంలో కూడా కొన్ని స్థానాలు గెలుచుకోవడం దాదాపు ఖాయమైపోయినట్లే భావించవచ్చు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకె పార్టీతో బిజెపి, ప్రతిపక్ష డీఎంకె పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తున్నాయి. డీఎంకె, కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడు మజ్లీస్‌ కూడా తోడవడంతో అగ్నికి వాయువు తోడైనట్లవుతుంది.


Related Post