కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నా: జగ్గారెడ్డి

January 01, 2021


img

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గాంధీ భవన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం కెసిఆర్ కి ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం సంగారెడ్డికి మెడికల్ కాలేజీని ఇస్తానని హామీ ఇచ్చారు కానీ అది కాస్తా సిద్దిపేటకు తరలించారు. ఐదేళ్ల క్రితం అంటే 2015లోనే సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రతిపాదనలు పంపానని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరి ఉంటే బాగుండేదన్నారు. సీఎం కేసీఆర్‌కు ఎన్నికలప్పుడు మాత్రమే సంగారెడ్డి మెడికల్ కాలేజీ గుర్తొస్తుందని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. సంగారెడ్డికి సంబందించిన విషయాలు మాట్లాడేందుకు తాను సీఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కోరానని, దాని కోసమే ఎదురుచూస్తున్నానని అన్నారు. రాబోవు 2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీయే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్‌ హయాంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు.

అయితే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇదివరకు టిఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నించినట్లు ఊహాగానాలు వినిపించాయి. కానీ టిఆర్ఎస్‌ స్పందించకపోవడంతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ సిఎం కేసీఆర్‌, ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కనుక ఆయన జిల్లాకు సంబందించిన సమస్యల గురించి మాట్లాడేందుకే సిఎం కేసీఆర్‌ను కలవాలనుకొంటున్నారా లేదా తనను టిఆర్ఎస్‌లో చేర్చుకోవాలని కోరేందుకు సిఎం కేసీఆర్‌ అపాయింట్‌మెంట్ కోరారో?


Related Post