కాంగ్రెస్‌ నేతలు చల్లబడిపోయారు... ఎందుకో?

December 31, 2020


img

పిసిసి అధ్యక్షపదవి కోసం కాంగ్రెస్ పార్టీ పరువుపోయేలా బజారుకెక్కి కీచులాడుకొన్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, గత నాలుగైదు రోజులుగా మౌనం పాటిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః కాంగ్రెస్‌ అధిష్టానం వారితో వేర్వేరుగా మాట్లాడి బుజ్జగించించడం వలననే మౌనం వహిస్తున్నారా లేక అధిష్టానం అందరికీ గట్టిగా హెచ్చరించడం వలన చల్లబడిపోయారా?అనేది తెలియదు. అలాగే పిసిసి అధ్యక్షుడి నియామకం సంగతి ఏమైందో కూడా తెలీదు. త్వరలో ఎమ్మెల్సీ, మునిసిపల్ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు ఉన్నందున అవి ముగిసేవరకు బహుశః ఉత్తమ్‌కుమార్ రెడ్డినే పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించాలని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించినందునే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరూ చల్లబడ్డారేమో?ఏది ఏమినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు కనబడుతోంది. 

కాంగ్రెస్‌ అధిష్టానానికి అగ్నిపరీక్షగా మారిన పిసిసి అధ్యక్ష పదవి ఎంపికను వారికే పరీక్షగా మార్చగల అవకాశం కాంగ్రెస్‌ అధిష్టానం ముందుంది. త్వరలోనే రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు జరుగబోతున్నాయి. పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నవారికి ఒక్కొక్కరికీ ఒక్కో ఎన్నికల పూర్తి బాధ్యతను అప్పగించి వాటిలో పార్టీని గెలిపించినవారికే ఆ పదవి ఇస్తామని పోటీ పెడితే వారి సత్తా ఏమిటో తేలిపోతుంది...అప్పుడు మిగిలినవారు ప్రశ్నించలేరు కూడా. ఒకవేళ ఆ ఎన్నికలలో వారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోగలిగితే పార్టీ కూడా లభ్ది పొందగలుగుతుంది కదా?


Related Post