ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేసీఆర్‌ హడావుడి: బండి

December 30, 2020


img

సిఎం కేసీఆర్‌ హటాత్తుగా 50,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, ఉద్యోగులందరికీ జీతాలు పెంచడం, ఎల్ఆర్ఎస్‌పై వెనక్కు తగ్గడం వంటివన్నీ త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ, మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేసినవేనని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. అయితే ఇప్పుడు కూడా ఆయన మాట నిలబెట్టుకొంటాడనే నమ్మకం లేదన్నారు. ఫిబ్రవరి వరకు కమిటీ...చర్చలు…పేరుతో కాలయాపన చేసి ఆ తరువాత  ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఈ హామీలను అమలుచేయకుండా తప్పించుకొంటారని బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. ఒకవేళ సిఎం కేసీఆర్‌కు ఉద్యోగాల భర్తీ, జీతాల పెంపు, పీఆర్సీ తదితర అంశాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తేదీలు (షెడ్యూల్) ప్రకటించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. 

సిఎం కేసీఆర్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నిరుద్యోగ భృతి చెల్లించకుండా ఎగవేయాలని చూస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. 2018 శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన ఆ హామీ ప్రకారం అప్పటి నుంచి నేటి వరకు నెలకు రూ.3,000 చొప్పున రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం రూ.72,000 బాకీ పడిందని, దానిని చెల్లించాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. ఉద్యోగసంఘాల నేతలు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంచాగిరీ చేస్తూ ఉద్యోగులకు ద్రోహం చేయవద్దని బండి సంజయ్‌ హితవు పలికారు. 

రాష్ట్రంలో రైతులు, ప్రజలు, ప్రభుత్వోద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు... ఇలా అన్ని వర్గాల తరపున బిజెపి చేస్తున్న పోరాటాల కారణంగా సిఎం కేసీఆర్‌ దిగివస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. సిఎం కేసీఆర్‌ను ‘యూ టర్న్ ముఖ్యమంత్రి’గా బండి సంజయ్‌ అభివర్ణించారు.


Related Post