కాంగ్రెస్‌, బిజెపిలకు అవకాశం కల్పించిన సిఎం కేసీఆర్‌

December 29, 2020


img

నియంత్రితసాగు విధానంపై సిఎం కేసీఆర్‌ వెనకడుగు వేసి కాంగ్రెస్‌, బిజెపిలకు తనను విమర్శించే అవకాశం కల్పించినట్లయింది. ఆ విధానం గురించి మొదట చాలా గొప్పగా చెప్పుకొని ఇప్పుడు దాని వలన రైతులకు రూ.7,500 కోట్లు నష్టం వచ్చిందని చెప్పడం, కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయచట్టాలను వ్యతిరేకిస్తూ బంద్‌లో పాల్గొని ఇప్పుడు ఆ చట్టాల ప్రకారమే రైతులు తమ పంటలు ఎక్కడ కావాలనుకొంటే అక్కడ అమ్ముకోవాలని చెప్పడంతో సిఎం కేసీఆర్‌ చేజేతులా ప్రతిపక్షాలకు మంచి అవకాశం కల్పించినట్లయింది. 

కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ, “నియంత్రిత సాగు విధానంలో సాగుచేయాలని రైతులను ఆదేశించిన సిఎం కేసీఆర్‌, దాని వలన వారు రూ.7,500 కోట్లు నష్టపోయారని ఒప్పుకొన్నారు. కనుక నష్టపోయిన రైతులకు ఆ సొమ్ము చెల్లించాలి. ఢిల్లీ వెళ్ళక మునుపు వ్యవసాయచట్టాలను వ్యతిరేకించిన సిఎం కేసీఆర్‌ తిరిగిరాగానే వాటికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామంటూ రైతులను మోసం చేస్తున్నారు. కనుక సిఎం కేసీఆర్‌ రైతులకు క్షమాపణలు చెప్పాలి,” అని డిమాండ్ చేశారు.      

సీనియర్ కాంగ్రెస్‌ నేత మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ, “నియంత్రిత సాగు విధానం మంచిది కాదని మేము మొదటి నుంచి మొత్తుకొంటూనే ఉన్నాము. కానీ నేను రైతుని...నాకన్నీ తెలుసు...అంటూ సిఎం కేసీఆర్‌ బలవంతంగా ఆ విధానాన్ని రైతులపై రుద్దారు. ఇప్పుడు ఆయనే దాని వలన రైతులు రూ.7,500 కోట్లు నష్టపోయారని చెపుతూ యూ టర్న్ తీసుకొన్నారు. పైగా కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తివేస్తామంటున్నారు. ఢిల్లీ వెళ్ళివచ్చిన తరువాతే ఆయనలో హటాత్తుగా ఈ మార్పు వచ్చింది. టిఆర్ఎస్‌-బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందనే మా వాదన దీంతో మరోసారి నిరూపితమైంది. సిఎం కేసీఆర్‌ తాను రైతు పక్షపాతి అని చెప్పుకొంటారు. కనుక ఆయన చెప్పినట్లే  సాగుచేసిన రైతులకు న్యాయం చేస్తారా...లేదా... చెప్పాలి,” అని అన్నారు. 

బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులు రూ.7,500 కోట్లు నష్టపోయారని చెప్పిన కేసీఆర్‌ అందుకు కారణాలు కూడా చెప్పాలి. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్పడం ద్వారా సిఎం కేసీఆర్‌ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు...రైతాంగంలో ఓ అయోమయం సృష్టించి కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసే మాటయితే కొత్తగా నిర్మిస్తున్న రైతువేదికలనే కొనుగోలు కేంద్రాలుగా మార్చాలి. వ్యవసాయ చట్టాలపై అవగాహన లేకనే సిఎం కేసీఆర్‌ మొదట వాటిని వ్యతిరేకించారు కానీ ఇప్పుడు వాటిని అర్ధం చేసుకోవడంతో యూ టర్న్ తీసుకొన్నారు,” అని అన్నారు. 


Related Post